న్యూఢిల్లీ: 2025 సంవత్సరానికి గానూ వైద్యశాస్త్రంలో ముగ్గురిని నోబెల్ బహుమతి వరించింది. వైద్య శాస్త్రంలో శరీర రోగనిరోధక వ్యవస్థకు సంబంధించి చేసిన పరిశోధనలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలు.. మేరీ ఇ బ్రంకో, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షిమోన్ సకాగుచి లను నోబెల్ పురస్కారానికి సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. సోమవారం స్వీడన్ లో నోబెల్ సెలక్షన్ కమిటీ ఈ ప్రకటన చేసింది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ దాని స్వంత కణజాలాలపై దాడి చేయకుండా నిరోధించేందుకు సంబందించిన ఆవిష్కరణలకు వీరు నోబెల్ బహుమతి అందుకోనున్నారు. నోబెల్ పురస్కారంతోపాటు ఈ ముగ్గురూ 11 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ కూడా అందుకుంటారు.
కాగా, ఈరోజు ప్రారంభమైన 2025 నోబెల్ పురస్కాల ప్రకటన 13వ తేదీ వరకు కొనసాగనుంది. మంగళవారం భౌతిక శాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యంతో నోబెల్ బహుమతులు ప్రకటించనున్నారు. శుక్రవారం నోబెల్ శాంతి బహుమతిని, అక్టోబర్ 13న ఆర్థిక శాస్త్రంలో నోబెల్ స్మారక బహుమతిని ప్రకటిస్తారు. ఈ అవార్డు ప్రదానోత్సవం డిసెంబర్ 10న జరుగుతుంది. విజేతలకు ప్రైజ్ మనీతోపాటు బంగారు పతకాన్ని కూడా అందిస్తారు.