కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం
బీహార్ ఎన్నికల్లో అమలు
భవిష్యత్తులో దేశవ్యాప్తంగా..
బీహార్‌లో పర్యటించిన తరువాత సిఇసి ప్రకటన
న్యూఢిల్లీ: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రక్రియలో 17 సంస్కరణాత్మక కార్యక్రమాలను ప్రవేశ పెడుతున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆదివారం నాడు ప్రకటించారు. బీహార్ పర్యటన ముగింపు సందర్భంగా పట్నాలో జరిగిన విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కమిషన్ చేపట్టిన ఈ చర్యల వల్ల బీహార్‌లో ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలవుతుందన్నారు. భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా అ మలుకు ముందస్తు సన్నాహంగా ఉపయోగపడతాయని అన్నారు. ఎన్నికల సంఘం బూత్ స్థాయి అధికారులకు గు ర్తింపు కార్డులు, పోలింగ్ కేంద్రాల బయట మొబైల్ ఫోన్ డిపాజిట్ చేయలన్న నిబంధన, పూర్తి వెబ్ కాస్టింగ్ నిర్వహణ వంటి చర్యలను ప్రవేశపెడుతోంది.
సంస్కరణలో కూడిన 17 చర్యలలో చాలావరకూ విజయవంతంగా అమలు చేపట్టారు. కొన్ని ఎన్నికల నిర్వహణ సమయంలో, మరికొన్ని కౌంటింగ్ సమయంలో అమలు చేస్తారని సిఈసి తెలిపారు.ఓటరు నమోదు తర్వాత 15 రోజులలోగా ఎలక్టర్ ఫోటో గుర్తింపు కార్డులు -ఇపిఐసి- అందజేసే లక్ష్యంగా కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ చేపట్టారు. ఓటింగ్ ప్రక్రియ క్రమబద్ధీకరణకు పోలింగ్ బూత్‌ల వెలుపల మొబైల్ డిపాజిట్ చేసే సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు.
ప్రతి పోలింగ్ బూత్‌లో 1200 మంది ఓటర్లు
పోలింగ్ కేంద్రాలవద్ద పొడవైన క్యూలైన్లను, రద్దీని నివారించేందుకు ప్రతి పోలింగ్ స్టేషన్ లో 1200 కంటే తక్కువ మంది ఓటర్లనే అనుమతిస్తారు. ఈ నిర్ణయం బీహార్ నుంచే మొదట అమలవుతుంది. బీహార్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా ఒక పోలింగ్ బూత్ లో1200 మంది ఓటర్లనే పరిమితి చేస్తున్నారు. ఇంతవరకూ 1500 మంది ఓటర్లకు అవకాశం ఉండేది. ఓటర్ల పరిమితి తగ్గింపుతో బీహార్ లో కొత్తగా మరో 12,817 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయాల్సి వస్తుంది. దీంతో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 90, 712కు చేరుతుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అభ్యర్థుల కలర్ ఫోటోలు, పెద్ద అక్షరాలతో పేర్లు ముద్రిస్తారు.
పోలింగ్ అధికారులకు గుర్తింప కార్డులు
పోలింగ్ అధికారులకు అధికారిక ఐడీ కార్డులను అందజేస్తారని సిఈసి జ్ఞానేష్ కుమార్ తెలిపారు. పోలింగ్ కేంద్రంలో అధికారులు ఎవరో గుర్తించడానికి ఓటర్లకు ఇక సులభంగా ఉంటుందని ఆయన అన్నారు.ఓటర్లు పోలింగ్ కేంద్రంలోకి తమ మొబైల్ ఫోన్లను తీసుకువెళ్లేందుకు అనుమతించరు. వారు పోలింగ్ కేంద్రం బయట ఫోన్లను డిపాజిట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉందని నిర్థారించేందుకు బీహార్ లోని అన్ని పోలింగ్ కేంద్రాలలో 100శాతం వెబ్ కాస్టింగ్ కవరేజ్ ఉంటుందని ఎన్నికల కమిషనర్ తెలిపారు. గతంలో ఫారమ్ 17సి, ఈవిఎం కౌంటింగ్ యూనిట్ మధ్య ఏమైనా తేడాలు వస్తే, వివిఎటి లను పూర్తిగా తిరిగి లెక్కించవలసి ఉండేదని ఆయన తెలిపారు.
ఇప్పుడు 100శాతం వెబ్ కాస్టింగ్ వల్ల ఆ సమస్య ఉండదన్నారు. నవంబర్ 22లోపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతాయని జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గడువు ముగిసినట్లు కూడా ఆయన ప్రకటించారు.