కొచ్చి: కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ బంగారు తాపడం పనుల్లో జరిగిన అక్రమాలపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. దీనిపై దర్యాప్తు నిర్వహించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్ ) ఏర్పాటు చేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కేరళ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడిజిపి) హెచ్. వెంకటేష్ సిట్‌కు నేతృత్వం వహిస్తారు. ఈ కుంభకోణంలో అవినీతికి పాల్పడింది కేవలం ఉన్నికృష్ణన్ మాత్రమే కాదని, దేశాలయ ఆస్తులను నిర్వహించే దేవస్వం బోర్డు అధికారుల ప్రమేయం కూడా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.న ఈ కేసులో ఐపీసి కింద శిక్షార్హమైన అనేక నేరాలు జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోందని కోర్టు పేర్కొంది.
ఈ కేసులో బలం చేకూర్చే ఒక కీలక అంశాన్ని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. 2019 డిసెంబర్ 9న ఉన్నికృష్ణన్ పొట్టి, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడికి పంపిన ఒక ఈ మెయిల్‌ను కోర్టు పరిశీలించింది. శబరిమల గర్భగుడి, ద్వారపాలకుల విగ్రహాల బంగారం పనులు పూర్తయిన తరువాత తన వద్ద కొంత అదనపు బంగారు పలకలు మిగిలాయని, పొట్టి ఆ ఈమెయిల్‌లో పేర్కొన్నారు. ఆ అదనపు బంగారాన్ని ఓ పేద అమ్మాయి పెళ్లికోసం వినియోగించడంపై దానిలో అభిప్రాయం కోరారు. ఈ ఈమెయిల్ చూస్తుంటే పొట్టి వద్ద మిగులు బంగారం ఉన్నట్టు స్పష్టమవుతోందని, అందుకే ఈ అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు అవసరమని కోర్టు పేర్కొంది. ఆలయ పవిత్రతను కాపాడేందుకు దేవాలయ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు సిట్ దర్యాప్తు కీలకంగా మారనుంది.