బీహార్ రాష్ట్రంలో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు నిర్వహించి.. నవంబర్ 14న కౌంటింగ్ చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌పై ఇసి మీడియా సమావేశం నిర్వహించింది.
ఈ సందర్భంగా ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ మాట్లాడుతూ.. “బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 22 ఏళ్ల తర్వాత బీహార్ ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో సంస్కరించాం. మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉండగా… వారిలో పురుష ఓటర్లు 3.92 కోట్లు, మహిళ ఓటర్లు 3.5 కోట్లు ఉన్నారు.100 ఏళ్లు పైబడిన ఓటర్లు 14 వేల మంది ఉన్నారు. 2025 జూన్ 24 నుంచి ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించాం. మార్పులు చేర్పులతో సెప్టెంబర్ 30న ఫైనల్ ఓటర్ లిస్ట్ ఇచ్చాం. నామినేషన్ల కంటే 10 రోజుల ముందు వరకు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవచ్చు. బీహార్‌లో 90,172 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఎస్సీ స్థానాలు 38 ఉండగా.. ఎస్టీ స్థానాలు రెండు ఉన్నాయి. బీహార్ ఎన్నికల నుంచి కొత్తగా 17 రకాల సంస్కరణలు తీసుకొస్తున్నాం.. ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫొటో ఉంటుంది” అని వివరించారు.