లక్నో: రాంగ్ నంబర్ కాల్ ఓ యువతి ప్రాణం తీసింది. యువతి అదృశ్యమైన రెండున్నర సంవత్సరాల తరువాత ఆమె అస్థిపంజరం లభించింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హర్దోయ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 2023 ఫిబ్రవరిలో సోనమ్ అనే వివాహిత ఓ రాంగ్ నంబర్‌కు కాల్ చేసింది. మస్‌దూల్ అనే వ్యక్తి ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి అడిగాడు. ఫోన్ కాల్ ఇద్దరు మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. అప్పటికే సోనమ్‌కు భర్త ఉన్నాడు. ఆమె భర్త జీవనోపాధి నిమిత్తం యుపి బయట నివసిస్తున్నాడు. 2023 అగస్టు 6న ఆమె కనిపించకపోవడంతో మామ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు, కానీ ఆమె ఆచూకీ మాత్రం దొరకలేదు. ఆరుగురు పోలీస్ అధికారులు మారిన కూడా ఆమె ఆచూకీ లభించకపోవడంతో కేసును మూలకు పడేశారు.
నాలుగు నెలల క్రితం ఎఎస్‌పి నృపేంద్ర సోనమ్ అదృశ్యం కేసు దర్యాప్తు పున:ప్రారంభించారు. ఆమె సెల్‌ఫోన్‌కు వచ్చిన 3000 ఫోన్ కాల్స్ రికార్డును పరిశీలించాడు. సోనమ్ రాంగ్ నంబర్ కాల్ గురించి వివరాలు ఆరా తీశాడు. గుజరాత్‌కు చెందిన మస్‌దూల్‌గా గుర్తించారు. మస్‌దూల్ అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. సోనమ్‌తో ఢిల్లీలో సహజీవనం చేశానని అనంతరం హర్దోయ్‌లో కొంత కాలం ఒకే ఇంట్లో ఉన్నామని వివరించాడు. 2023 అగస్టు 23న సోనమ్‌తో మస్‌దూల్ గొడవకు దిగాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో మస్‌దూల్ తన తమ్ముడు షామ్స్‌దూల్, తండ్రి అయూబ్‌తో కలిసి ఆమెను చంపేశారు. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేశాడు. పోలీసులు మళ్లీ కేసు నమోదు చేసి పోలీసులు బావిలో నుంచి అస్థిపంజరం బయటకు తీసి పోస్టుమార్టమ్‌కు పంపారు. పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.