గత కొద్ది రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. బీహార్ అసెంబ్లీ లోని 243 స్థానాలకు రెండు విడతల్లో.. నవంబర్ 6వ తేదీన తొలివిడత, నవంబర్ 11న రెండో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక నవంబర్ 11న జరుగుతుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు, జూబ్లీహిల్స్ తో సహా 8 రాష్ట్రాల్లో ఉపఎన్నికల ఫలితాలు నవంబర్ 14 న ప్రకటిస్తారు. బీహార్ లో నవంబర్ 6న తొలివిడతలో సెంట్రల్ బీహార్, గ్రామీణ ప్రాంతాలతో కూడిన 121 అసెంబ్లీ స్థానాలకు, నవంబర్ 11న రెండో దశలో సరిహద్దు ప్రాంతాలలోని 122 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.
మొదటి దశ నామినేషన్ల దాఖలుకు చివరితేదీ అక్టోబర్ 17. పరిశీలన అక్టోబర్ 18న. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ, అక్టోబర్ 20. మొదటి దశ పోలింగ్ నవంబర్ 6.అలాగే, రెండో దశ నామినేషన్లకు చివరితేదీ అక్టోబర్ 20, పరిశీలన అక్టోబర్ 21న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 23. రెండోదశ ఎన్నికల పోలింగ్ నవంబర్ 11న జరుగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనతో నవంబర్ 16 కల్లా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తవు తుంది.బీహార్ లో శాంతి భద్రతలను కాపాడుతూ, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎని్నికల యంత్రాంగం అన్నివిధాలా కృషి చేస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. అనేక రాజకీయ పార్టీల అభ్యర్థనలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కమిషన్ ఈ నెల చివర్లో వచ్చే ముఖ్యమైన పండుగ ఛత్ పూజ తర్వాత ఎన్నికల షెడ్యూల్ ను నిర్ణయించిందని ఆయన తెలిపారు. బీహార్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.43 కోట్లు. వీరిలో 14 లక్షలమంది తొలిసారి ఓటు వేస్తున్న యువతీ యువకులు ఉన్నట్లు తెలిపారు.
2020 ఎన్నికల్లో మొదటి దశలో ఎన్నికలు జరిగిన 16 జిల్లాల్లోని 71 అసెంబ్లీ నియోజకవర్గాలను నవంబర్ 6న జరగనున్న మొదటి దశలో పోలింగ్ కు షెడ్యూల్ చేశారు.
రంగంలో ప్రధాన పార్టీలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బహుముఖ పోటీలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ కు చెందిన జనతాదళ్ (యునైటెడ్) నాయకత్వంలోని బీజేపీ, ఇతరుల మద్దతు గల ఎన్జీఏ తిరిగి అధికారాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కూడిన మహాగట్బంధన్ కూటమి తిరిగి అధికారం దక్కించుకునేందుకు పోటీ పడనున్నది. నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని వరద ప్రభావిత ప్రాంతాలు , సున్నితమైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల అధికారులు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. సీఆర్పీఎప్ దళాలను ముందుగానే సన్నద్ధం చేసినట్లు సిఈసీ కుమార్ ప్రకటించారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ బీహార్ పర్యటన సందర్భంగా ఎన్నికలకు సంబంధించి జిల్లా మెజిస్ట్రేట్, పోలీసు సూపరింటెండెంట్ లకు ఎటువంటి హింసకు తావులేకుండా ఎన్నికలు కట్టుదిట్టంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు సిఏపిఎఫ్ ను ముందుగానే మోహరించబడుతోంది. అధికారులు నిష్పాక్షికంగా వ్యవహరించాలని, తప్పుడు వార్తలు ప్రచారం కాకుండా నివారించాలని సిఈసీ అధికారులను ఆదేశించారు. అలాగే , మద్యం, డబ్బు, మాదక ద్రవ్యాలను నిరోధించడానికి అన్ని చెక్ పోస్ట్ ల వద్ద కఠినంగా నిఘా నిర్వహించబడుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఇప్పటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పరీక్షలు, పోలింగ్ సిబ్బంది శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మారుమూల నియోజకవర్గాలతో రవాణా, వరద నిర్వహణ, పరిపాలనా సంసిద్ధతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. మూడు విడతల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది.
బీహార్ రాజకీయ పరిణామాల చరిత్ర
బీహార్ లో రాజకీయ పరిణామాలు మారుతూ, పొత్తులు మారడం ఓ చరిత్ర. రెండు దశాబ్దాలుగా బీహార్ లో జెడియు నాయకత్వంలోని ఎన్డీఏ, ఆర్డేజీ నాయకత్వంలోని ప్రతిపక్షాల మధ్య అధికారం దోబూచు లాడింది. నితిశ్ కమార్ నాయకత్వంలోని జెడియు బీజేపీ, ప్రతిపక్ష పార్టీలతో పొత్తుల మధ్య ఊగిసలాడుతుండగా, ఆర్జేడీ యాదవ్ , ముస్లిం ఓటర్లతో బలంగా ఉంది.
కోవిడ్ -19 మహమ్మారి నీడలో 2020 అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. ఎన్డీఏ అధికారాన్ని నిలుపుకుంది. నితిశ్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆర్జేడీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. బీహార్ లో 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 38 ఎస్సీలకు, 2 ఎస్టీలకు రిజర్వు చేయబడ్డాయి.
2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో జెడీయు, బీజేపీ, హెచ్ ఏఎం(ఎస్), విఐపిలతో కూడిన ఎన్డీఏ కూటమి -125 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ 75 సీట్లను, జేడీయూ 43 స్థానాలను, హెచ్ ఎఎం(ఎస్), విఐపి చెరో నాలుగు సీట్లను గెలుచుకున్నాయి. మరోపక్క ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్బంధన్ 110 సీట్లు గెలుచుకుంది. ఆర్జేడీ 75, కాంగ్రెస్ 19, వామపక్షాలు 16 సీట్లు గెలుచుకున్నాయి.