న్యూఢిల్లీ : బీహార్ లోని అన్ని స్థానాల్లో (243) పోటీ చేయనున్నట్టు ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రకటించింది. 11 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ఆప్ … బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుండటం ఇదే తొలిసారి. ఢిల్లీ, పంజాబ్‌లో అనుసరించిన పాలనా విధానాలను బీహార్ లోనూ అమలు చేస్తామని పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి అజేశ్ యాదవ్ తెలిపారు. “ అభివృద్ధి, పాలనకు సంబంధించి మా దగ్గర విజయవంతమైన నమూనా ఉంది. ప్రజా సంక్షేమం విషయంలో ఆప్ చేసిన పనులు దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి.
గతంలో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వ ఏర్పాటుకు పూర్వాంచల్ ప్రాంత ప్రజలు సహకరించారు. ఇప్పుడు బీహార్ లోనూ అండగా నిలుస్తారని ఆశిస్తున్నామని పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విశ్వాసం వ్యక్తం చేశారు.” అని అజేశ్ యాదవ్ పేర్కొన్నారు. బీహార్ ఎన్నికల్లో ఇతర పార్టీలతో జట్టుకట్టే అంశాన్ని ఆప్ రాష్ట్ర సహాయక ఇన్‌ఛార్జి అభినవ్ రాయ్ తోసిపుచ్చారు. ప్రజలతోనే తమకు పొత్తు ఉందని పేర్కొన్నారు. ఇతర పార్టీలు, కూటములతో కలసి పోటీ చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. జన్‌సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఇప్పుడిప్పుడే సంస్కరణల గురించి మాట్లాడటం ప్రారంభించారని, వాటిని తాము ఇప్పటికే క్షేత్రస్థాయిలో అమలు చేశామన్నారు.