న్యూఢిల్లీ/హైదరాబాద్ సిటీబ్యూరో : బీహార్ అసెంబ్లీ ఎన్నికల తో పాటు పలు రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాల కు ఉపఎన్నికలను నవంబర్ 11న నిర్వహించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ లోని జూబ్లీ హి ల్స్ అసెంబ్లీ స్థానంతో పాటు, జమ్మూకశ్మీర్ , ఒడిశా, జార్ఖండ్, మిజోరాం, పంజాబ్, రాజస్థాన్‌లో ఉపఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన నవంబర్ 14న జరుగుతుంది. తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో, ఈ ఏడాది జూన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. కాగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్‌వి కర్ణన్ హైదరాబాద్‌లో జారీ చేశారు. జీహెచ్‌ఎంసి
ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు షెడ్యూల్ జారీ కావటంతో హైదరాబాద్ జిల్లా మొత్తంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని కర్ణన్ ప్రకటించారు.ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈ నెల 13న జారీ చేయనున్నట్టు తెలిపారు. నవంబర్ 11న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్టు కర్ణన్ తెలిపారు. నామినేషన్లకు తుది గడువు అక్టోబర్ 21గా ప్రకటించారు.
నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22 వరకు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా అక్టోబర్ 24 వెల్లడించారు. పోలింగ్ నవంబర్ 11న, ఓట్ల లెక్కించడం నవంబర్ 14న అనంతరం నవంబర్ 16తో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ వెల్లడించారు. కాగా జమ్మూకశ్మీర్‌లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు బుడ్గామ్, నగ్రోటా స్థానాలు 2024 అక్టోబర్ నుంచి ఖాళీగా ఉన్నాయి. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రెండు స్థానాలలో పోటీ చేసి, రెండింటిలో గెలిచినా గండేర్ బల్ నియోజకవర్గాన్ని నిలుపుకోవాలని ఎంచుకుని బుడ్గామ్ స్థానానికి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉంది. 2024 అక్టోబర్ 31న ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా మరణించడంతో నగ్రోటా స్థానం ఖాళీ అయింది. రాజస్థాన్‌లోని అంటాలో అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే కన్వర్ లాల్ ను తుపాకీ బెదిరింపు కేసులో దోషిగా తేలడంతో అనర్హుడిగా ప్రకటించడంతో అంటాలో స్థానం ఉపఎన్నిక అనివార్యమైంది. మిజోరాం లో 2025 జూలై 21న ఎంఎన్ ఎఫ్ ఎమ్మెల్యే లాల్ట్రింట్టుంగా సై లో మరణించడంతో తంపా అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఒడిశాలో సెప్టెంబర్ 8న సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేంద్ర ధోలాకియా మరణించడంతో నువాపా అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. జార్ఖండ్ లోని ఘట్నిలా నియోజకవర్గంలో రామదాస్ సోరెన్ మరణంతో ఆ స్థానం ఖాళీ కావడంతో ఉపఎన్నిక జరపాల్సివచ్చింది.పంజాబ్ లో కాశ్మీర్ సింగ్ సోహల్ మరణంతో తర్న్ తరుణ్ అసెంబ్లీ స్థానం కూడా ఖాళీ అయింది. ఈ స్థానాలకు నవంబర్ 11న ఉపఎన్నికలు జరుగుతాయి.