ఆరు గంటలపాటు జడివాన కొత్తగూడెం, ఖమ్మం,
ములుగు, వికారాబాద్ జిల్లాల్లోనూ ప్రతాపం
ఉప్పొంగిన మూసీ, రాకపోకలకు అంతరాయం
మన తెలంగాణ/కామారెడ్డి/వికారాబాద్/భద్రాద్రి కొత్తగూడెం/ యాదాద్రి భువనగిరి: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు పడ్డాయి. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతులపై గోరుచుట్ట్టుపై రోకలి పోటులా కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దాదాపు 6 గంటల పాటు వర్షం కురవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆగస్టు నెలాఖరులో కురిసిన భారీ వర్షంతో జనజీవనం అతలాకుతులమైంది. భారీ వర్షాలకు నష్టపోయిన పంట పోగా, మిగిలిన పంటలు ప్రస్తుతం పొట్ట దశలో ఉన్నాయి. పంటలు నష్టపోని రైతులు పొట్ట దశలో ఉన్న వరి పంటను చూసి ఊరట చెందగా, మళ్లీ వర్షం రావడంతో రైతుల తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి, దోమకొండ, బిక్కనూరు, మాచారెడ్డి, రాజంపేట మండలాల్లో తేలికపాటి వర్షం పడింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని బొజ్జ తండా గ్రామానికి చెందిన రైతులు సాగు చేస్తున్న సుమారు 100 నుంచి 150 ఎకరాల్లో పత్తి, మిర్చి, వరి పంట పొలాలు భారీ వర్షానికి కొట్టుకుపోయాయి. పంట చేతికొచ్చే సమయానికి వర్షానికి కొట్టుకుపోవడంతో నష్టపోయామని గిరిజన రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. గత 30 ఏండ్లలో ఈస్థాయిలో వరదలు ఎప్పుడూ రాలేదని అన్నారు. పంటతో పాటు చేలలో ఉన్న తైవాన్ పంపులు, మందు కట్టలు, మోటర్లు, పైపులు కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా, ధరూర్ మండలంలో భారీ వర్షం కురవడంతో నాగసముద్రం, కోట్పల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. గొట్టిముక్కల, ద్యాచారం, నాగారం గ్రామాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి.
సంగారెడ్డి పట్టణంతోపాటు జిల్లాలోని జహీరాబాద్, జిన్నారం, కోహిర్ మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మెదక్ జిల్లాలోని కొల్చారం, చిన్నశంకరంపేట, పెద్దశంకరంపేటలో భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లా, ఏటూరు నాగారంలో అత్యధికంగా 11 సెం.మీ, ఖమ్మం జిల్లా లింగాలలో 10 సెం.మీ., సంగారెడ్డి జిల్లా, మొగడంపల్లి 9.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మంజీర, గండిపేట్, హుసేన్‌సాగర్ జలాశయాల గేట్లు తెరిచి మూసీ నదిలోకి నీరు వదిలారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లి మండలం, జూలూరు వద్ద గల వంతెనపై రెండు మూడు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో పోచంపల్లి=బీబీనగర్ మధ్య రాకపోకలు స్థంభించాయి. పోలీసులు బారికేడ్‌లను ఏర్పాటు చేసి రహదారిని మూసివేసారు.