బీజింగ్ : ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతం ఎవరెస్ట్‌పై మంచు తుపాను బీభత్సం సృష్టించింది. దీంతో వేల అడుగుల ఎత్తులో దాదాపు 1000 మంది పర్వతారోహకులు మంచు శిఖరంపై చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు స్థానికులతో కలిసి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే కొంతమంది హైపోథెర్మియా బారినపడగా వారిలో 41 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. 137 మందిని రిస్కు బృందాలు రక్షించాయని చైనా అధికారులు వెల్లడించారు. గల్లంతయిన పర్వతారోహకుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. 300 మంది సిబ్బంది, మరో 10 బృందాలు గుర్రాల పైన, రెండు డ్రోన్లపైన గాలిస్తున్నారు. అంతకు ముందు ప్రభుత్వ సిసిటివి కథనం ప్రకారం 350 మందిని రక్షించినట్టు, ఇంకా 200 మంది గల్లంతైనట్టు వార్తలు వచ్చాయి. టిబెట్‌లో ఎవరెస్ట్ పర్వతం తూర్పువాలు వైపు శుక్రవారం సాయంత్రం నుంచి దట్టంగా మంచు కురుస్తోంది.
ఆదివారానికి అది మంచు తుఫానుగా మారింది. దీంతో దాదాపు 1000 మంది క్యాంప్ సైట్ల వద్ద చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 350 మందిని రక్షించి క్యుడాంగ్ అనే చిన్న టౌన్‌షిప్‌కు తరలించారు. ఎవరెస్ట్ పైకి వెళ్లే మార్గాల్లో భారీగా మంచు చరియలు పడి దారులు మూసుకుపోయాయి. దీంతోవాటిని తొలగించేందుకు వందలాది మంది స్థానికులు రెస్కూ సిబ్బంది శ్రమిస్తున్నారు.
సాధారణంగా ఈ వైపు నుంచే పర్వతారోహకులు , హైకర్లు ఎక్కువగా ఎవరెస్ట్ పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పుడు చైనాలో సెలవులు కావడంతో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంది. అదే సమయంలో మంచు తుపాను సంభవించడంతో వీరంతా పర్వతంపై చిక్కుకుపోయారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో హైకర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్టా శనివారం నుంచి ఎవరెస్ట్ పైకి వెళ్లేందుకు అనుమతులు నిలిపివేశారు. సాధారణంగా అక్టోబరులో ఈ మంచు పర్వతంపై ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయి. మరో వైపు నేపాల్‌లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడటం కారణంగా ఇప్పటివరకు 52 మంది ప్రాణాలు కోల్పోయారు.