మెడికల్ పిజిలో అమలుకాని కోటా
అదనపు సీట్లు సృష్టించకుండా ఎన్‌ఎంసి తాత్సారం
నష్టపోతున్న అగ్రవర్ణ పేద విద్యార్థులు
మనతెలంగాణ/హైదరాబాద్ : అగ్రవర్ణ పేద విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ఎకనామికల్లీ వీకర్ సెక్షన్(ఇడబ్లూఎస్) రిజర్వేషన్లు దేశంలోని దాదాపు అన్ని కోర్సులలో అమలవుతుండగా మెడికల్ పిజిలో మాత్రం అమలు కావడం లేదు. వైద్యవిద్యలో ఎంబిబిఎస్, ఆయుష్ యుజి, పిజి కోర్సులలో ఇడబ్లూఎస్ రిజర్వేషన్లు అమలవుతున్నప్పటికీ మెడికల్ పిజి కోర్సులకు అమలు చేయడంపై నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్‌ఎంసి) దృష్టి సారించడం లేదు. ప్రస్తుతం ఎంబిబిఎస్, ఇతర కోర్సులలో అమలు చేస్తున్నట్లుగా మెడికల్ పిజి కోర్సులకు కూడా ఇడబ్లూఎస్ కోటాను అమలు చేయాలి. అందుకోసం నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రత్యేకంగా మెడికల్ పిజి సీట్లను సృష్టించి ఆయా రాష్ట్రాల మెడికల్ యూనివర్సిటీలకు అందజేయాలి.
గత కొన్నేళ్లుగా మెడికల్ పిజి సీట్లలో ఇడబ్లూఎస్ కోటా అమలుపై ఎన్‌ఎంసి తాత్సారం చేయడంతో ప్రతిభ గల అగ్రవర్ణ పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. మెడికల్ పిజి కోర్సులలో ఇడబ్లూఎస్ కోటా అమలు చేయకపోవడం పట్ల వైద్య విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇడబ్ల్యూఎస్ కోటాను కేంద్రం 2019లో ప్రవేశపెట్టింది. మొత్తం సీట్లలో 10 శాతం ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కేటాయించాలి. ఇడబ్ల్యూఎస్ కోటా అమలు చేయాలంటే ఇతరుల రిజర్వేషన్ దెబ్బతినకుండా ఉండేందుకు సీట్ల సంఖ్యను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా సీట్లు పెంచిన తర్వాతే కోటాను అమలు చేయాలి. అన్ని రకాల విద్యా సంస్థల్లోనూ సీట్ల సంఖ్య పెంచారు. అయితే ఎన్‌ఎంసి నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీల్లో మాత్రం పిజి సీట్ల సంఖ్య పెంచడానికి వీలు కాలేదు. దాంతో మెడికల్ పిజి కోర్సులో ఇడబ్లూఎస్ కోటా రిజర్వేషన్లు అమలుకు నోచుకోవడం లేదు.
మెడికల్ పిజి సీట్లకు భారీగా డిమాండ్
వైద్య విద్యలో పిజి సీట్లకు భారీగా డిమాండ్ ఉంది. ఎంబిబిఎస్ తర్వాత వైద్య విద్యార్థులలో చాలామంది పిజి చేసేందుకు మొగ్గు చూపుతారు. నీట్ పిజిలో మంచి ర్యాంకు సాధించేందుకు ఏడాది రెండేళ్లపాటు కోచింగ్‌లు తీసుకుంటున్నారు. ఎంబిబిఎస్ పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలలో చేరిన వారితో ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, సొంతంగా క్లినిక్‌లు నడుపుతున్న వారు కూడా పిజి సీట్లు పొందేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. మెడికల్ పిజి సీట్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సీట్లకు కూడా ఇడబ్లూఎస్ కోటా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని వైద్య విద్యార్థులు కోరుతున్నారు. ప్రైవేట్‌లో ఈ సీట్లు కోట్లు పలుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
మిగతా అన్నింట్లోనూ అమలు..
రాష్ట్రంలో ఎంబిబిఎస్, ఇంజనీరింగ్, పార్మసీ సహా అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో ఇడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలోనూ ఇడబ్ల్యూఎస్ కోటా అమలవుతోంది. వైద్య విద్య పిజి ప్రవేశాలలో మాత్రమే ఈ కోటా అమలు కావడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని మెడికల్ పిజి కోర్సులలో కూడా ఇడబ్లూఎస్ కోటా అమలయ్యే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.