42 శాతం బిసి రిజర్వేషన్‌ల సాధనకు అన్ని పార్టీలు కలిసి రావాలి
అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం పిలుపు
మన తెలంగాణ / హైదరాబాద్ : స్థానిక సంస్థల్లో 42 శాతం బిసి రిజర్వేషన్‌ల సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని బిసి సంఘాలు, ప్రజా ప్రతినిధుల అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. రిజర్వేషన్‌ల సాధన కోసం రాజకీయాలకతీతంగా పోరాడాలని సమావేశం నిర్ణయించింది. బిసిలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు దక్కించుకుందాం. ఎంతవరకైనా తెగించి పోరాడుదాం అంటూ పలువురు నాయకులు, ప్రజాప్రతినిదులు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో అఖిల పక్ష పార్టీల ప్రజాప్రతినిధులు, ప్రముఖ నాయకులు, బిసి సంఘం నాయకులు సమావేశమై సుప్రీంకోర్టు – హైకోర్టులలో బిసి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేసిన కేసులపై భవిష్యత్తు కార్యచరణ పై చర్చించారు. బిసి నేతలు కోల జనార్దన్, గుజ్జ కృష్ణ నేతృత్వంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపి ఆర్.కృష్ణయ్య, ఎంఎల్‌సి మధుసూధనా చారి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు, బిసి నేతలు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సుప్రీంకోర్టు – హైకోర్టులలో వేసిన కేసులను ఎదుర్కోడానికి ప్రముఖ అడ్వకేట్లను నియమించి పోరాడాలని, హైకోర్టులో వెంటనే కేసులు వేయాలని కోరారు. సుప్రీంకోర్టులో వేసిన కేసుల్లో అన్ని రాజకీయ పార్టీలు ఇంప్లీడు కేసులు వేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ అడ్వకేట్లను నియమించి కేసును వాదించాలని సమావేశం కోరింది. బిసిల పోరాటాలు , ఉద్యమాలతో 42 శాతం రిజర్వేషన్లు సాధించామని, ప్రభుత్వం స్పందించి జిఓ 9 జారీ చేసి ఎన్నికలు జరపడానికి నిర్ణయించిందని నేతలు అన్నారు. రాజీలేని పోరాటం చేసి దీన్ని కాపాడుకుందామన్నారు. 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత, న్యాయబద్ధత, రాజ్యాంగబద్ధత ఉందని నేతలు అన్నారు.
కొందరు రిజర్వేషన్లు గిట్టని వారు 50 శారం సీలింగ్ ఉందని చెప్పి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సమాజంలో ఏ వర్గం వారు కూడా బిసి రిజర్వేషన్‌లను వ్యతిరేకించరాదని కోరారు. బిసిలు, అగ్రకులాలు వందల సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నారని, ఒక సంప్రదాయంతో సోదర భావంతో బ్రతుకుతున్నామని, బిసిలు పోరాడి పోరాడి సాధించుకున్న రిజర్వేషన్ ను వ్యతిరేకిస్తే తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు.