ఇస్లామాబాద్ : మరోసారి తమపైకి సైనిక దాడికి దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని భారతదేశానికి పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరికలు వెలువరించారు. పాకిస్థాన్‌తో సైనిక దుస్సాహాసానికి దిగితే తాము ఈసారి ఘాటైన రీతిలో జవాబు ఇచ్చి తీరుతామని ఆయన ఆదివారం ప్రకటించారు. ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగినా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఇటీవలే భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సైనిక దళాల చీఫ్ ద్వివేదిలు వేర్వేరుగా పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ రెండో దశ ఉంటుందని ప్రకటించారు. వారి వైఖరి మారకపోతే గ్లోబ్‌లో నుంచి పాక్ మటుమాయం అవుతుందని ద్వివేది ఘాటుగా స్పందించిన నేపథ్యంలో దీనికి పాక్ రక్షణ మంత్రి జవాబిచ్చారు.
భారతదేశం నుంచి వెలువడుతున్న పలు కవ్వింపు ప్రకటనలను తాము గమనిస్తున్నామని, ఎటువంటి సైనిక చర్యకు దిగినా దెబ్బకు దెబ్బతీసి తీరుతామని ఆసిఫ్ హెచ్చరించారు. భారత పాలకపక్షం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రగాల్బాలకు దిగుతోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆసిఫ్ క్రికెట్ పరిభాషలో మాట్లాడారు. భారత్ ౦-6 తేడాతో కీలక పరాజయం పొందింది. అయినా తిరిగి ఇదే తంతుకు దిగితే ఈసారి స్కోర్ అల్లా అనుకుంటే ఇంతకు ముందటికంటే మరింత బాగుంటుందని వ్యాఖ్యానించారు. అయితే ఈ 0-6 మాటలకు అర్థం ఏమిటనేది ఆయన వివరించలేదు. అయితే పాకిస్థాన్ సేనలు బారత్‌కు చెందిన ఆరు యుద్ధ విమానాలను కూల్చివేశాయనే విషయం చెప్పడానికి యత్నించి ఉంటారని భావిస్తున్నారు.