మన తెలంగాణ / హైదరాబాద్ : బిసిలకు న్యాయబద్ధంగా రావాల్సిన 42 శాతం రిజర్వేషన్లను రెడ్డి సంఘం పేరుతో మాధవరెడ్డి, గోపాల్ రెడ్డిలు అనేక కుట్రలు కుతంత్రాలతో అడ్డుకోవాలని చూస్తున్నారని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బిసి రిజర్వేషన్లను అడ్డుకుంటే రాష్ట్రవ్యాప్తంగా బిసిలంతా అగ్గి రాజేస్తారని ఆయన హెచ్చరించారు. బిసి రిజర్వేషన్లు పెంచడం వల్ల రాష్ట్రంలో ఏ సామాజిక వర్గానికి నష్టం లేనప్పటికీ కొంతమంది ఎలాగైనా అడ్డుకొని తీరాలని తెరవెనుక ఎంతోమంది అగ్రకుల శక్తులు కుటీల ప్రయత్నాలు మొదలు పెట్టారని ఆయనన్నారు. రెడ్డి జాగృతికి చెందిన మాధవరెడ్డి గోపాల్ రెడ్డి లను ముందు పెట్టి బిసి రిజర్వేషన్లకు గండిగొట్టి బిసిలను రాజకీయంగా అణిచివేయాలని పథకం పన్నుతున్నారని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కామారెడ్డి డిక్లరేషన్‌లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించినప్పుడు, రాష్ట్రంలో కులగణన చేసినప్పుడు, అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేసినప్పుడు ఎప్పుడూ నోరు ఎత్తని రెడ్డి సంఘం తీరా 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ జిఓను విడుదల చేయగానే రాత్రికి రాత్రే కోర్టులను వేదికగా చేసుకొని బిసిలకు అన్యాయం తలపెట్టాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. బిసిల పక్షాన ధర్మం న్యాయం ఉందని, హైకోర్టులో సుప్రీంకోర్టులో బిసిలకు న్యాయం జరుగుతుందని విశ్వాసం తమకుందని జాజుల అన్నారు. ఒకవేళ బిసి రిజర్వేషన్లు తగ్గితే చరిత్రలో మాధవరెడ్డి గోపాల్ రెడ్డిలు బిసి ద్రోహులుగా మిగిలిపోతారని, వారిని చరిత్ర క్షమించదని అన్నారు. బిసి రిజర్వేషన్లను రక్షించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 7న రాష్ట్ర వ్యాప్తంగా పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు శాంతియుతంగా నిరసనలు తెలపాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.