ధైర్యమే అధైర్యపడి తలవంచింది. చైతన్యం అచేతనమైంది. ధైర్యం అనే పదానికి గుర్తుగా ఉన్నటువంటి మనిషి కాలంతో ప్రయాణించలేక ఆగిపోయాడు. తనను అభిమానించే లక్షలాదిమంది అభిమానులను వదిలేసి వెళ్లిపోయాడు. 73 సంవత్సరాల వయస్సులో ఇంకా గడపాల్సిన జీవితం ఉన్నా, కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, మాజీ మంత్రిగా, ఐదుసార్లు శాసన సభ్యునిగా, తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాలే కాకుండా ఉమ్మడి నలగొండ, ఖమ్మం జిల్లాల్లో అశేష జనాదరణ పొందిన రామ్‌రెడ్డి దామోదర్‌రెడ్డి మరణించటం అత్యంత విషాదకరం. ఎన్నో కుటుంబాల తీరుగా మా కుటుంబం కూడా దామోదర్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనది. నేను బహుశా 4వ లేదా 5వ తరగతిలో చదువుతున్న వయస్సులోనే మొట్టమొదటిసారిగా దామోదర్ రెడ్డిని నా స్వగ్రామమైన కుక్కడంలో చూడటం జరిగింది.
మా ఊరికి వచ్చినప్పుడల్లా మా నాన్న కోసం మొట్టమొదలు మా ఇంటికి వచ్చేవాడు, దూరంగా కూర్చుని ఏవో రాజకీయాలు మాట్లాడుతుండేవారు, ఆ పల్లెటూరే ఒక ప్రపంచంగా ఉండేటువంటి ఆ రోజుల్లో, కాంగ్రెస్ పార్టీ పాటలతో, మూడు రంగుల జెండాలతో, ఒక జీపు, ఆ జీపు వెనుక వందలాదిమంది కార్యకర్తలు, మా ఇంటి ముందుకు వచ్చి ఆగేది. తెల్లటి దుస్తుల్లో, మెరుపులా మెరుస్తూ, విశాలమైన హాసంతో, గంభీరమైన స్వరంతో, భుజానికి ఒక నల్లటి సంచితో దామోదర్ రెడ్డి ఆ జీపులో నుంచి దిగివచ్చి వెళ్ళిన తర్వాత ఉరుములతో మెరుపులతో కూడిన భారీ వర్షం వచ్చి ఆగిపోయినట్టుండేది. గ్రామానికి నాయకుడు రావడం అంటే ఆ చిన్న ప్రపంచం పెద్ద దేశంతో కలిసినట్టే. జెండాలు, నినాదాలు, ప్రభుత్వం అనే పదం నా మనసులో నేను కూడా భారతదేశంలో భాగమే అనే భావం కలిగించేవి.
ఎంఎల్‌ఎ, ఎన్నికలు, పార్టీలు, ఓట్లు లాంటి పదాలు విని ప్రజాస్వామ్యం పట్ల ఎవ్వరు చెప్పకుండానే నాలాంటి చిన్న పిల్లలకు కూడా తెలిసిపోయేది. పుస్తకాలలో చదువుకోకుండానే వచ్చే జ్ఞానం అది. దామోదర్ రెడ్డి రాజకీయ ప్రయాణమంతా నిశ్శబ్దమైనదైనా నిరంతర కృషితో సాగింది. రోజుకు, పూటకు ఒక పార్టీ మారే ఈరోజుల్లో తను నమ్మిన సిద్ధాంతాన్నీ, కాంగ్రెస్ పార్టీని చివరి శ్వాసవరకు వదిలిపెట్టకుండా ఉన్న అతి కొద్దిమంది నాయకులలో దామోదర్ రెడ్డి అగ్రగణ్యులు. ప్రత్యేక తెలంగాణ కోసం అసెంబ్లీలో గొంతు ఎత్తినా, శ్రీరామ్ సాగర్ రెండవ దశ నీళ్ల కోసం పోరాటం చేసినా, ప్రతిపక్షంలోఉన్నా, పాలక పక్షంలో ఉన్నా, ఐదుసార్లు ఎంఎల్‌ఎగా, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసినా, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు చేసినా, కమ్యూనిస్టు పార్టీ, తెలుగుదేశం పార్టీ, తర్వాత టిఆర్‌ఎస్‌తో రాజకీయ యుద్ధం చేసినా, ఆయన అన్నీ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి పార్టీ జెండాను పట్టుకుని సుమారు 40 సంవత్సరాలు పోరాటం చేశారు. గ్రామీణ తెలంగాణ మట్టి నుంచి ప్రజాసేవ పథంలో ఆయన ప్రారంభించిన ప్రయాణం డబ్బు సంపాదనకో, పదవీ కాంక్షతోనో కాకుండా, రాజకీయాలు అంటే కేవలం అధికారం కాదు, సేవ చేయడం అనే బాధ్యత కూడా అని పూర్తిగా నమ్మిన వ్యక్తి రాంరెడ్డి దామోదర్ రెడ్డి.
ఖమ్మం జిల్లా పాత లింగాల గ్రామంలో పుట్టిన దామోదర్ రెడ్డి నలుగురు అన్నదమ్ములు, అతని అన్నగారైన కీర్తిశేషులు శ్రీరామ్ రెడ్డి వెంకట్ రెడ్డి కూడా సుజాతనగర్ అసెంబ్లీ నుంచి నాలుగు సార్లు ఎంఎల్‌ఎగా ఎన్నికై మంత్రిగా కూడా పని చేశారు. 1994 ఎన్నికలలో రాష్ట్రమంతా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఇండిపెండెంట్ సభ్యునిగా అసెంబ్లీకి ఎన్నికై మొత్తం నల్గొండ జిల్లాలోనే ఏకైక కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యునిగా కొనసాగారు. సూర్యాపేట, తుంగతుర్తిలోని అనేక కుటుంబాలకు, మా కుటుంబానికీ దామోదర్ రెడ్డి కేవలం ఎంఎల్‌ఎ కాదు, కుటుంబ సభ్యుడే. మా తండ్రి వేముగంటి సుధాకర్ రావు, ఆయనతోపాటు జీవితాంతం కాంగ్రెస్ పార్టీకోసం పనిచేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. పంతులుగారు అని ప్రేమగా, ఆప్యాయంగా మా నాన్నను ఆయన పిలిచేవారు. ఆ బంధం నాకు చిన్నప్పటినుంచే రాజకీయ విశ్వాసం కాదు, మంచి నాయకత్వంపై విశ్వాసం అనే పాఠాన్ని నేర్పింది. దామోదర్ రెడ్డి నిస్వార్ధంగా ప్రజల కోసం శ్రమించారు, కాంగ్రెస్ పార్టీకి నమ్మకంతో పనిచేశారు, గౌరవంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ విలువలను ముందుకు తీసుకెళ్లడం అతని ఆశయాలను నమ్మిన ప్రతి ఒక్కరి బాధ్యత.
(రచయిత ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్అమెరికా ప్రధాన కార్యదర్శి)
వేముగంటి శరత్ చంద్ర