ఆస్ట్రేలియా పర్యటనకు వె్ళ్లే టీం ఇండియా వివరాలను బిసిసిఐ శనివారం వెల్లడించింది. ఇందులో వన్డే జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్‌ను, టి-20 జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను నియమించారు. అయితే ఈ సిరీస్‌కి ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సూర్య పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఎంఎస్ ధోనీ సారథ్యంలో మ్యాచ్‌లో ఒక్క మ్యాచ్‌లోనైనా ఆడే అవకాశం రాలేదని పేర్కొన్నాడు.
‘‘ధోనీ భారత జట్టు సారథిగా ఉన్నప్పుడు అతడి నాయకత్వంలో ఒక్క మ్యాచ్ అయినా ఆడాలని కోరుకునే వాడిని.. కానీ, ఆ అవకాశం రాలేదు. ఐపిఎల్‌లో ప్రత్యర్థులుగా తలపడ్డాం. ధోనీ ‘కూల్’గా ఉండటం చూసి ఆశ్చర్యం వేసేది. స్టంప్స్ వెనుక అంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నాడో అర్థమయ్యేది కాదు. ధోనీకి ప్రత్యర్థిగా ఉన్నప్పుడు ఒకే ఒక్క విషయం నేర్చుకున్న.. ఒత్తిడిలో ఎలా రిలాక్స్‌డ్‌గా ఎలా ఉండాలని. తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటాడు’’ అని ధోనీ గురించి సూర్యకుమార్ చెప్పాడు.