చిక్కుకున్న వేలాది మంది పర్యాటకులు
పరిస్థితిపై బెంగాల్ సిఎం మమత సమీక్ష
సహాయక చర్యలకు నేడు పర్యటన
ప్రధాని మోడీ స్పందన .. సానుభూతి
డార్జిలింగ్ : పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ భారీ వర్షాలు, కొండచరియల భారీ పతనంతో ఆదివారం అతలాకుతలం అయింది. పగబట్టిన ప్రకృతి వైపరీత్యాల దుర్ఘటనలలో 20 మంది మృతిచెందారు. పలువురు కొండచరియలు విరిగిపడ్డ ఘటనలలో గాయపడ్డారు. రాత్రి నుంచి వదలకుండా కురుస్తోన్న భారీ వర్షాలతో జనజీవితం స్తంభించింది. బెంగాల్ ఉత్తర ప్రాంతంలోని మిరిక్, డార్జిలింగ్ పర్వత ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలతో ఈ ప్రాంతాలలో పలు చోట్ల ఫక్కా ఇళ్లు కూడా పేకమేడలుగా కూలాయి. చాలా వరకూ నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. అనేక చోట్ల రహదారులు గుంతలు పడ్డాయి. దీనితో మారుమూల ప్రాంతాలకు ప్రత్యేకించి అక్కడి పర్యాటక స్థలాలకు రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు ఆదివారం మధ్యాహ్నం తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం, ఎన్‌డిఆర్‌ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఎక్కువగా సర్సాలీ, జస్బీర్‌గాన్, మిరిక్ బస్తీ, ధార్ గావ్, నగర్‌కత, మింక్ లేక్ వద్ద వర్షాలతో బీభత్సం తలెత్తిందని అధికారులు తెలిపారు. ఒక్క మిరిక్‌లోనే పలు దుర్ఘటనలలో 11 మంది వరకూ మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
ఈ ప్రాంతాలలో ఎక్కువగా కొండచరియలు కూలాయి. డార్జిలింగ్‌లో ఏడుగురు మృతి చెందారు. ఇక్కడ పోలీసులు, స్థానిక అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున సహాయక చర్యలకు దిగింది. పరిస్థితి గురించి డార్జిలింగ్ జిల్లా సబ్ కలెక్టర్ రిచర్డ్ లెప్చా ఎప్పటికప్పుడు సమాచారం వెలువరిస్తున్నారు. రాత్రి కురిసిన భారీ వర్షాలతో పరిస్థితి దారుణంగా మారింది. సహాయక, పునారావాస చర్యలు సాగిస్తున్నామని వివరించారు. డార్జిలింగ్ ఇతర ప్రాంతాలలో పరిస్థితిపై ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పందించారు. తాను ఆయా ప్రాంతాలలో సోమవారం పర్యటిస్తామని కొల్‌కతాలో చెప్పారు. బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. అయితే ఎంత అనేది వివరించలేదు.
ప్రధాని మోడీ డార్జిలింగ్ ఇతర చోట్ల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. చాలా ప్రాంతాలలో వరదలలో చిక్కుపడ్డ వారిని, శిథిలాల కింద కూరుకుపోయిన వారిని సకాలంలో రక్షించడంతో మృతుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే చాలా వరకూ ఇళ్లు బురద మేటల్లో, విరిగిపడ్డ కొండచరియలతో దారుణ స్థితికి చేరాయి. పరిస్థితి విషమంగానే ఉందని నార్త్ బెంగాల్ వ్యవహారాల మంత్రి ఉదయన్ గుహా పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. డార్జిలింగ్‌కు వచ్చిన వేలాది మంది పర్యాటకులు ఎటు కదలలేని స్థితిలో చిక్కుపడ్డారు. వారికి సరైన ఏర్పాట్ల కోసం అధికార యంత్రాంగం శ్రమిస్తోంది. భూటాన్‌లో భారీ వర్షాలతో నీటి ప్రవాహం భారీగా దిగువన ఉన్న ఉత్తర బెంగాల్ జిల్లాల్లో పరవళ్లు తొక్కింది. పర్యాటకులు కంగారు పడవద్దని వారిని సురక్షిత ప్రాంతాలకు లేదా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి మమత బెనర్జీ సచివాలయంలో అధికారులతో సమీక్ష తరువాత చెప్పారు.