మన తెలంగాణ/హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో విద్యుత్ శాఖ మాజీ ఏడిఇ అంబేద్కర్ అరెస్ట్ అయిన విషయం విధితమే. ఈ కేసులో మరిన్ని వివరాలు ఆయన్నుంచి రాబట్టేందుకు కస్టడీకి తీసుకుని విచారించాలని ఏసిబి అధికారులు బావించారు. చంచల్‌గూడ జైలులో ఉన్న అంబేద్కర్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసిబి అధికారులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ఏసిబి కోర్టు నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు ఏసిబి అధికారులు అంబేద్కర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో సెప్టెంబర్ 16వ తేదీన అంబేద్కర్ నివాసంతో పాటు, కార్యాలయాలు, బందువుల ఇళ్లలో ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ సోదాల్లో ప్లాట్లు, భవనాలు, భూములను గుర్తించి, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ. 200 కోట్లకు పైగా ఉంటుందని గుర్తించారు. ఈ కేసుతో అంబేద్కర్‌ను విద్యుత్ శాఖ విధుల నుంచి తొలగించింది. కాగా, అంబేద్కర్ ఏఇ, ఏడిగా ఇబ్రహింబాగ్, నార్సింగ్, మణికొండ ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతి లభించడంతో ఆస్తుల సంపాదన, ఇతర అంశాలపై ఏసిబి అధికారులు ఆయన్ను ప్రశ్నించనున్నారు.