అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా కురపాం గురుకుల పాఠశాలలో 60 మంది విద్యార్థినులకు పచ్చ కామెర్ల వ్యాధి సోకడంతో పాటు ఇద్దరు బాలికలు మృతి చెందారు. కురపాం బాలికల గురుకుల పాఠశాలలో 60 మంది విద్యార్థినులకు పచ్చ కామెర్లు, విష జ్వరాలు సోకాయి. దీంతో మెరుగైన వైద్య చికిత్స కోసం మరో 19 మంది విద్యార్థినులను కెజిహెచ్ ఆసుపత్రికి గురుకుల సిబ్బంది తరలించారు. వారం రోజుల వ్యవధిలో 10వ తరగతి చదువుతున్న అంజలి, కల్పన బాలికలు అనారోగ్యానికి గురై మృతి చెందారు. కురుపాం గ్రామంలో ఫిడ్రియాటిక్ వైద్యులు నీటి నమూనాలను సేకరించడంతో విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో మంచి నీటి వసతులు, మరుగుదొడ్లు సరిగా లేవని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థులకు సరైన పోషకాహారం కూడా అందించడం లేదని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. పాఠశాలల్లో మంచి నీటి వసతులు కల్పిస్తామని మంత్రి చేసిన మొదటి సంతకం ఏమైందని విద్యార్థినుల తల్లిదండ్రులు నిరసనకు దిగారు. గురుకుల హాస్టళ్లు శుభ్రంగా ఉండడంలేదని వాపోతున్నారు.