బీహార్ ఓటర్ల జాబితా వివాదం మధ్య, కొన్ని రోజుల్లోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ఎన్నికల వ్యూహాలను మెరుగుపరుచుకుంటున్నాయి. కానీ యథాప్రకారం అభ్యర్థుల ఎంపికలో కులం కార్డే కేంద్ర బిందువు అవుతుంది. ఏదైనా ఎన్నికల్లో రెండు విధాలుగా ఓటర్లను ప్రలోభపరచవలసి ఉంటుంది. ఐదేళ్ల క్రితం లాలూప్రసాద్ అప్పటి ఎన్నికలను అగ్డా (అగ్ర వర్గాలు), పిచ్చడా (వెనుకబడిన వర్గాలు) మధ్య పోరాటంగా అభివర్ణించారు. బిజెపిని సంప్రదాయ అగ్రకులాల, ఉన్నత వర్గాల పార్టీగా ప్రకటించారు. 2024లో ‘ఇండియా కూటమి’ కూడా రెండు విధాలుగా ప్రచారాన్ని ముందుకు సాగించాలని ఆకాంక్షించింది. వెనుకబడిన వర్గాలపైనే దృష్టిపెట్టి మరింత సంరక్షణ వారికి అవసరమని ప్రచారం సాగించింది.
బీహార్‌లో వెనుకబడిన వర్గాల సమీకరణకు సుదీర్ఘ చరిత్ర ఉంది. వలస కాలంనుంచే ఈ తరహా ఉద్యమాలు మొదలయ్యాయి. ఇవి రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు అధికారాన్ని కట్టబెట్టాయి. ఈ వెనుకబడిన వర్గాల సమీకరణే ఎన్నికల పోటీకి సాధనంగా ఉపయోగపడుతుంది. ఉన్నతవర్గాలు, తక్కువస్థాయి వర్గాలు అన్న తేడాయే విచక్షణకు దారితీస్తుంది. ఏదెలాగున్నా పొత్తులు, ప్రతిపొత్తుల ఆట, మొత్తంమీద పార్టీ వ్యవస్థలో రాజకీయ చీలికలు ఈ రెండు కోణాల దృష్టిని నిత్యం క్లిష్టం చేస్తున్నాయి. చారిత్రకంగా చూస్తే బిజెపి అభ్యర్థుల ఎంపిక ఉన్నత కులాల అనుకూలంగానే ఉంటుంది. 2020 లో బిజెపి 74 మంది ఎంఎల్‌ఎల్లో 33 మంది (40%) ఉన్నత కులాల వారే. అలాగే ఎక్కడా బిజెపి ముస్లిం అభ్యర్థులను ఎంపిక చేయదు. అంటే దీని అర్థం మిగతా అభ్యర్థులు ఒబిసి(26), ఇబిసి(2) నుంచి ఎంపిక చేసిన వారే. దీనికి విరుద్ధంగా జెడియు 43 మంది ఎంఎల్‌ఎల్లో 22 మంది ఒబిసి, ఇబిసిలకు చెందినప్పటికీ కేవలం 10 మంది మాత్రమే ఉన్నత కులాల వారు ఉన్నారు.
చాలామంది జెడియు ఎంఎల్‌ఎల్లో ఏడుగురు కుర్మీలు, నలుగురు యాదవులతో కలుపుకుని స్థానిక ప్రాధాన్యం కలిగిన ఒబిసి గ్రూపులకు చెందినవారే. మరోవైపు ఆర్‌జెడి నిర్మొహమాటంగా పూర్తిగా యాదవులకే అనుకూలంగా ఉంటుంది. 2020లో ఆర్‌జెడి అవకాశం ఉన్నంత వరకు సీట్ల సర్దుబాటు ఒప్పందాన్ని సద్వినియోగం చేసుకుంది. 44 సీట్లలో 26ను గెలుచుకుంది. బిజెపి, జెడియుకు భిన్నంగా ఆర్‌జెడి ముస్లిం అభ్యర్థులను నియమించింది. కాంగ్రెస్ కూడా అలాగే చేసింది. వాస్తవానికి ప్రధాన పార్టీలన్నిటిలో కాంగ్రెస్ లోనే ముస్లిం ఎంఎల్‌ఎల జనాభా ఎక్కువ. కానీ అది కూడా బీహార్‌లో అతిచిన్న నాలుగు పార్టీల్లో ఒకటిగా మిగిలిపోతుంది. 2000 సంవత్సరం మొదట్లో లాలూ తగ్గిపోవడంతో కుర్మీలు/ కుష్వాహాలు, మరికొంతమంది ఇబిసిలతోపాటు యాదవేతర ఒబిసిల ప్రాతినిధ్యానికి చోటు లభించింది.
2020లో తొమ్మిది వేర్వేరు గ్రూపులనుంచి వైవిధ్యంగా 28మంది ఒబిసి ఎంఎల్‌ఎలను ఎంచుకుంది. వీరిలో చాలావరకు బనియాలు, యాదవులు కూడా ఉన్నారు. బిజెపి, జెడియు లేదా ఆర్‌జెడి ఏదైనా ఎన్నికైన ఒబిసి ఎంఎల్‌ఎల్లో మెజార్టీ స్థానిక ప్రాధాన్యం కలిగిన సామాజిక వర్గాలవారే ఎంపికయ్యారు. ఇబిసిలు ప్రచార వాక్చాతుర్యానికి కేంద్రబిందువే అయినప్పటికీ, చాలావరకు మినహాయింపబడ్డారు. బీహార్ జనాభాలో ఇబిసిలు దాదాపు 36 శాతం నుంచి 40 శాతం ఉన్నప్పటికీ, 2020 అసెంబ్లీలో వారి ప్రాతినిధ్యం కేవలం 11 శాతానికి పరిమితమైంది. చాలా పార్టీలు తమ టికెట్ల పంపిణీలో వైవిధ్యం చూపించినప్పటికీ ఫలితాలలో పెద్ద చీలిక కనిపించింది. తీవ్రమైన కుల విభజనే కీలకమవుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 22 శాతం ఓట్లతో ఆర్‌జెడి అతిపెద్ద పార్టీగా తెరపైకి వచ్చింది. 2014 నుంచి హిందీ బెల్టులో బిజెపి ఆధిపత్యం వహిస్తున్నా ఓట్లలో అయిదోవంతు మాత్రమే పొందగలిగింది.
అభ్యర్థుల ఎంపికలో వైవిధ్యం చూపించాలని బిజెపి కాంక్షిస్తున్నా, అధికారంలో ఉండడానికి మిత్రవర్గాల పొత్తుపైనే ఆధారపడవలసి వస్తోంది. ముఖ్యంగా దాని ప్రధాన మిత్రపక్షం జెడియు తన జాతి మతపరమైన జాతీయవాద భాగాన్ని పంచకుండా ఇప్పటికీ సెక్యులర్‌శక్తిగా తన అస్తిత్వాన్ని ప్రదర్శిస్తోంది. కులాల చీలిక, వెనుకబడిన వర్గాల సుదీర్ఘ చారిత్రక ప్రభావం బిజెపి హిందుత్వవాదాన్ని అడ్డుకుంటున్నాయి. సామాజిక, ఎన్నికల పొత్తుల నిర్మాణానికే మొగ్గుచూపుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ వంటి చరిష్మా కలిగిన హిందుత్వరాజకీయ నేత లేకపోవడం కూడా బిజెపికి మైనస్ పాయింటే. మతపరమైన కేంద్రీకరణ బీహార్‌లో చాలా తక్కువ ప్రభావం చూపుతుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే బీహార్ రాజకీయ వ్యాకరణ మౌలిక స్వరూపం మారే అవకాశం లేదు.
2023లో నితీశ్‌కుమార్ నిర్వహించిన కులాల గణన బట్టి బీహార్ రాజకీయాల్లో కులమే ప్రధాన బలమైన పునాదిగా వెల్లడవుతోంది. అయితే ఈసారి రెండు కోణాలనుంచి అత్యంత ముఖ్యమైన అనిశ్చితి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ నిర్వహించిన ఓటర్ల జాబితాపై సమగ్ర సర్వే ఒకటి కాగా, మరొకటి ప్రశాంత్ కిశోర్ ‘జనసూరజ్’ ప్రచారం. పంజాబ్‌లో స్థానిక ఉన్నత వర్గాలను తిరస్కరించి ఓటర్లు బయటనుంచి వచ్చిన ఆమ్‌ఆద్మీపార్టీకి ఎలాగైతే పట్టం కట్టారో అలాగే బీహార్‌లో కూడా జరుగుతుందని ప్రశాంత్ కిశోర్ భవిష్యత్ రాజకీయ అంచనాలు వేస్తున్నారు. కానీ బీహార్ పంజాబ్‌లా కాదు. ఇక్కడ కులం అన్నది చాలా లోతుగా వేళ్లూనుకుంది. కిశోర్ స్వంత వ్యూహం కూడా కులం గణాంకాలను ప్రతిబింబిస్తోంది. ఆయన ప్రచారం కూడా సంప్రదాయ కుల స్వరంపైనే ఆధారపడుతోంది. ఏ పార్టీకి ఫలితాలు ఎలా వస్తాయో చెప్పలేకపోయినా ఇప్పుడు అనిశ్చితి మాత్రం వెంటాడుతోంది.