అది నాగపూర్. నాగానది ఒడ్డున ఉన్న నగరం. అది ఈ రోజు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ప్రతి ఏడాది నాగపూర్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయుంటుంది. నాగపూర్ జనాభా ప్రస్తుత 30 లక్షల దాటి ఉంటుందని అంచనా. అయితే అక్టోబర్ 2వ తేదిన ఆ నగరాన్ని వరద ముంచెత్తింది. అది నీటి వరద కాదు జనసంద్రం. 30 లక్షల ఉన్న జనాభా నగరాన్ని దాదాపు 50 లక్షల సునామి ముంచెత్తింది. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. సముద్ర సునామి ప్రాంతాలను మింగేస్తుంది. కానీ 50 లక్షల జన సునామి నాగపూర్‌కు ఎటువంటి చెడు చేయలేదు. చాలా శాంతంగా, ప్రశాంతంగా వెనకు వెళ్ళింది. అయితే గురువారం, అక్టోబర్ 2వ తేదిన విజయదశమ రోజున ఆ మహోత్సవ సంఘటన ప్రతి సంవత్సరం కొత్త చరిత్రను తిరగ రాస్తుంది. పంచవన్నె పతాకాలతో, పంచశీల పఠనంతో ఆ రోజు నాగపూర్ దద్దరిల్లింది.
వందలూ, వేలు కాదు ఏకంగా యాభై లక్షల మందికి పైగా నమో—- బుద్ధాయ, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంగం శరణం గచ్ఛామి అంటూ స్మరిస్తుంటే నాగపూర్ ఎంతో తధేక దీక్షలో మునిగిపోయింది. నాగపూర్ వీధుల్లో ప్రతి ఏడాది కనిపించే అపురూప దృశ్యమిది. చిన్న, చిన్న సభలు సమావేశాలు జరిగితే పోలీసుల పహరాను అభ్యర్థిస్తుంటారు. సహజంగానే పోలీసులు శాంతి భద్రతల సమస్యను నివారించడానికి అక్కడ హాజరవుతుంటారు. కానీ నాగపూర్‌లో గురువారం రోజున పోలీసుల ఆనవాలు అతి తక్కువ. అది కూడా ఎక్కడో నగర కూడళ్ళలో తమ రోజువారీ విధులను నిర్వర్తిస్తున్నారు. కానీ జనసమూహంలో వారి జాడలేదు. లక్షల జన వాహిని స్వయం నియంత్రణతో చాలా బాధ్యతగా వ్యవహరిస్తుంది. వాలంటీర్లు అక్కడకి చేరుకున్న వారికి కావాల్సిన సహాయాన్ని అందిస్తుంటారు.
కిలోమీటర్ల పొడవు బారికేడ్లు ఉంటాయి. రావడానికి ఒకటి పోవడానికి మరొకటి ఉంటుంది. విశేషమేమిటంటే, ఒకరినొకరు తోసుకొని వెళ్ళడాని ప్రయత్నించరు. దానితో తొక్కిసలాటకు అవకాశం లేదు. ఇందులో పసిపిల్ల, వృద్ధులు, మహిళలు చాలా పెద్ద సంఖ్యలో ఉంటాయి. అందరూ ఒకే వరుసలో నడుస్తుంటారు. దొంగతనాలు, మహిళల వేధింపులు మచ్చుకైనా చూడం. నియమబద్ధంగా సాగుపోయే ఈ దృశ్యం నిశ్శబ్దంగా సాగిపోతున్న నది ప్రవాహంలా ఉంటుంది. రెండు జీవనదులు ఒకదానికొకటి ఎదురుగా కదలిపోతున్న భావం కలుగుతుంది. నాకు తెలిసి భారత దేశంలో జరిగిన, జరుగుతున్న అనేక సమ్మేళనాలు, జాతరలు, మేళాలు, రాజకీయ సభలు నాగపూర్ జన సంద్రాన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
ఎంతో శాంతంగా క్రమశిక్షణతో మరెంతో ఓపికతో తమ వంతు వచ్చే వరకు కదిలే ప్రయత్నిం ఎవరూ చేయరు. ఇది ఒక అద్భుత సందర్భం. భారతదేశం నుంచి బౌద్ధం మాయమైపోయిందని, ఇతర దేశాల్లో మాత్రమే అది కొనసాగుతున్నదని సంతోషపడిన చాలా మందికి 1956 , అక్టోబర్ 14వ తేది విజయదశమి రోజు ఒక పీడకల లాంటిది. నేపథ్యం ప్రతి సంవత్సరం విజయదశమి రోజున నిర్వహించే ఈ కార్యక్రమానికి 70 సంవత్సరాలు నిండాయి. దీనినే బౌద్ధ పరిభాషలో ధమ్మచక్ర ప్రవర్తన దివస్‌గా పిలుస్తారు. ఆ రోజు అంటే 1956, అక్టోబర్ 14వ తేదీన దాదాపు అయిదున్నర లక్షల మందితో బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధం స్వీకరించారు. భారతదేశంలో పాటు ప్రపంచం మొత్తాన్ని ప్రత్యేకించి దక్షిణాసియా దేశాలను ప్రభావితం చేసిన బౌద్ధం ఈ విప్లవ సంరంభంతో నూతన జవ సత్వాలను అందిపుచ్చుకున్నది. అయితే బాబా సాహెబ్ అంబేద్కర్ బౌద్ధం వైపు ఆలోచించడానికి, ఈ బౌద్ధ నవీన విప్లవానికి రూపకల్పన చేయడానికి ఆయన ఎదుర్కొన్న వివక్ష, అవమానాలు, దాడులు, దౌర్జన్యాలే కారణమని చెప్పక తప్పదు.
అంటరానితనానికి, కుల వివక్షకు వ్యతిరేకంగా సమాన హక్కుల కోసం బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాటాలు ఆయనకు చేదు అనుభవాన్నిచ్చాయి. 1927 మార్చి 20వ తేదీన జరిగిన మహర్ చెరువు పోరాటంలో సనాతన హిందువులు కర్రలతో, రాళ్ళతో దాడి చేసి దళితుల తలలు పగుల గొట్టారు. అదే విధంగా 1930 మార్చి 2వ తేదీన నాసిక్‌లోని కాలారాం దేవాలయానికి వెళ్ళిన బాబాసాహెబ్ అంబేద్కర్‌ను, ఆయన అనుచరులను అడ్డుకున్నారు. ఆ ఘటన తర్వాత దేవాలయ ప్రవేశ పోరాటం అర్థంలేనిదని తేల్చివేశారు. ఆ తర్వాత 1930 31 సంవత్సరాలలో లండన్‌లో జరిగిన రౌండ్ టేండ్ సమావేశాలలో బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించిన సపరేట్ ఎలక్టోరేట్ అంటే తమ అభ్యర్థులను తామే ఎన్నుకునే విధానాన్ని మహాత్మా గాంధీ తన నిరాహార దీక్షతో వెనక్కొచ్చారు. దాని ఫలితంగా వచ్చిన పూనా ఒడంబడిక కేవలం రిజర్వేషన్ స్థానాలను మాత్రమే అందించింది. ఇది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్‌ను బాధకు గురిచేసింది.
ఈ మూడు ఘటనలు ఆయనను ఇక ఎంత మాత్రం అంటరానితనంతో వెలివేసిన దళితుల బతుకులు హిందూమతంలో ప్రగతికి నోచుకోరనే నిర్ధారణకు వచ్చారు. ఒక రెండు సంవత్సరాల తర్వాత 1935 అక్టోబర్ 13వ తేదీన నాసిక్ సమీపంలోని యోలా పట్టణంలో మాట్లాడుతూ “నేను హిందువుగా పుట్టాను. కానీ హిందువుగా మాత్రం మరణించను” అంటూ ప్రకటించారు. అప్పటి నుంచి అనేక కులాలను అధ్యయనం చేస్తూనే, బౌద్ధం వైపు తన ప్రత్యేక దృష్టిని సారించారు. అయితే రాజకీయ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నందువల్ల ఆయన తక్షణమే మతం మారే నిర్ణయం తీసుకోలేదు. అయితే కులం, హిందూమతం లాంటి అనేక విషయాలపై చాలా విస్తృతమైన అధ్యయనం చేశారు. ఆ క్రమంలోనే ఆయన బౌద్ధం వైపు అధ్యయనాన్ని వేగవంతం చేశారు. అయితే బౌద్ధం చాలా లోతైన అధ్యయనం అవసరమని భావించి, తనతోపాటు బౌద్ధం తీసుకునే వాళ్లు విద్యావేత్తలు, మేధావులు కానందువల్ల వాళ్లందరికీ అర్థమయ్యే పద్ధతిలో ఒక పుస్తకం రాయాలని, ఆ తర్వాతనే ప్రజలను ఆహ్వానించాలని భావించి ‘బుద్ధుడు అతని బోధనలు’ అనే పుస్తకాన్ని రచించి, ఆ తర్వాత బౌద్ధం స్వీకరించడానికి 1956, అక్టోబర్ 14 వ తేదీని ఖరారు చేశారు.
ఇది నేపథ్యం. అయితే ఇక్కడ చివరగా ఒక విషయాన్ని సమాజం ముందుంచాలని భావిస్తున్నాను. పుష్కరాలు, కుంభమేళాలు, జాతరలు, మత పెద్దల సమ్మేళనాలను మీడియా పతాక శీర్షికల్లో ప్రచురించడం, టివి ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారాలు అందించడం తమ బాధ్యతగా భావిస్తాయి. అది తప్పేమీ కాదు. అంతేకాకుండా వాళ్ల ఇష్టం. అయితే నాగపూర్‌లో బాబా సాహెబ్ అంబేద్కర్ బౌద్ధం స్వీకరించిన రోజును దాదాపు అరకోటి మంది ఒక ఉత్సవంగా జరుపుకుంటే పత్రికలు, ఛానెళ్లు అది తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటం ఎట్లా అర్థం చేసుకోవాలి. 1956 అక్టోబర్ 14వ తేదీన కార్యక్రమానికి 70 ఏళ్ల కిందట విదేశీ మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. దేశంలో ఒక రోజు ఇన్ని లక్షల మంది ఒక చోట చేరి ఎంతో క్రమశిక్షణతో తమ అంకిత భావాన్ని ప్రకటించుకొని శాంతియుతంగా వెళ్లిపోతున్న సందర్భం పత్రికలకు, మీడియాకు ఎందుకు పట్టడం లేదనేది సమాధానం లేని ప్రశ్న. ఇది వివక్షలో భాగం కాదా? ఇది ఈ దేశ చారిత్రక సాంప్రదాయం కాదా? ఇది దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పే సందర్భం కాదా? భారత దేశంలోని మేధావులు, పత్రికా ప్రపంచం ఆలోచించాల్సిన అంశం.
– మల్లేపల్లి లక్ష్మయ్య (దర్పణం)