కోట్లాదిమంది తమిళ ప్రజల ఆరాధ్య నటుడు, తమిళగ వెట్రి కళగం పేరిట కొత్తగా ఒక రాజకీయ పార్టీని ప్రారంభించి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న విజయ్‌కి నాయకత్వ లక్షణాలు లేవని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆయన దర్శనంకోసం ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా లక్షలాదిగా జనం వస్తుంటే హైకోర్టు ఏమిటి ఇలా వ్యాఖ్యానించింది? ఇటీవల విజయ్ తమిళనాడులోని కరూర్‌లో నిర్వహించిన ఒక రాజకీయ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట కారణంగా 40మందికి పైగా మరణించడం, ఎంతోమంది గాయాలపాలు కావడం తెలిసిందే. ఇటువంటి సమావేశాలపై ఆంక్షలు విధించాలంటూ దాఖలైన ఒక పిటిషన్ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సెంథిల్ కుమార్ ఎదుట విచారణకు వచ్చినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఘటన జరిగిన వెంటనే ఈ సభ నిర్వహించిన పార్టీ నాయకులందరూ అక్కడినుంచి వెళ్లిపోవడం, ఆ సమయంలో మిగతా పార్టీలవారు సహాయక చర్యలు చేపట్టడం, నిర్వాహకులు ఏమీ పట్టనట్టుగా ఉండటం విజయ్ నాయకత్వ లోపాన్ని స్పష్టం చేస్తున్నదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
సరే, ఈ పిటిషన్లు దాఖలు చేసినవారిలో కొందరు న్యాయవాదులు కూడా ఉన్నట్టున్నారు. అసలు విజయ్ ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం పార్టీ గుర్తింపును రద్దు చేయాలనడంతోపాటు వారు కోర్టుని మరికొన్ని కోరికలు కోరారు. ఇటువంటి సంఘటనలు జరిగిన వెంటనే రాజకీయ పార్టీలను రద్దు చేయడం, సంస్థలను రద్దు చేయడం, ప్రభుత్వాలను అధికారంలోంచి దించేయడం నిజంగా జరిగితే ఇప్పటివరకు స్వతంత్ర భారతదేశంలో రాజకీయ కుంభమేళాలు, మత సంబంధమైన కుంభమేళాల్లో ఇప్పటిదాకా జరిగిన సంఘటనల కారణంగా పలు పార్టీలు రద్దయి ఉండేవి. పలు ప్రభుత్వాలు కూలిపోయేవి. పలు సంస్థలు మూతపడవలసి ఉండేవి. భారత ప్రజాస్వామ్యంలో ఇవాళ జరిగిన సంఘటనను మరునాడు మర్చిపోవడం మన అలవాటు చేసుకున్నాం కదా. గతంలో జరిగిన వాటన్నిటి మాదిరిగానే కరూర్ తొక్కిసలాటలో చనిపోయినవారి కుటుంబాలు మినహా మిగతా ప్రపంచం ఆ దుర్ఘటన గురించి మరిచిపోతుంది.
రాజకీయ కుంభమేళాలు అన్నప్పుడు భారతదేశంలో జరిగిన కుంభమేళాల సందర్భంగా జరిగిన దుర్ఘటనల్లో చనిపోయిన అసంఖ్యాకులు గుర్తొస్తారు. అవి రాజకీయ మేళాలైనా, ధార్మిక కుంభమేళాలైన ఒక్క అమాయక ప్రాణం కూడా పోని విధంగా జాగ్రత్తలు తీసుకోగలిగితేనే వాటిని నిర్వహించాలన్న స్పృహతో పాటు కఠినమైన చట్టాలు ఉంటే తప్ప ఇలా జననష్టం ముందుముందు కూడా జరుగుతుంది. ఇప్పటికి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, అయినా చట్టాలు చేసేవారిలో కదలిక అయితే కనిపించడంలేదు. ముందుగా మత సంబంధమైన కుంభమేళాల గురించి లేదా ధార్మిక కుంభమేళాల గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డిఎ ప్రభుత్వ అధినేత నరేంద్ర మోడీ, ఆయన ప్రభుత్వంలోని ఇతర మంత్రులు పొద్దున లేస్తే భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూని పనికిరానివాడని, ఆయన దేశానికి ఏమీ చేయలేదని విమర్శించిన మాటలు గుర్తొస్తాయి. నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలంలో 1954నాటి కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 800 మంది చనిపోతే నెహ్రూ ఆ సంఖ్యని దాచే ప్రయత్నం చేయకుండా ఒక సలహా ఇచ్చారు. అదేమిటంటే, రాజకీయ నాయకులు, విఐపిలు ఇటువంటి సందర్భాలలో ఆ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని. ఆ తర్వాత పలుమార్లు నెహ్రూ తర్వాత కూడా జరిగిన కుంభమేళాల్లో పలు కారణాల వల్ల తొక్కిసలాటలు జరుగుతూనే ఉన్నాయి. జనాలు చనిపోతూనే ఉన్నారు.
1986లో హరిద్వార్ కుంభమేళాలో 50 మంది చనిపోయారు. 1992 ఉజ్జయిని సింహస్త కుంభమేళాలో 50 మంది, 2003 నాసిక్ కుంభమేళాలో 30 మంది మృతి చెందారు. నాసిక్‌లో వందమందికి పైగా గాయపడ్డారు కూడా. 2010లో హరిద్వార్ కుంభమేళాలో అయిదుగురు మృతి చెందగా, 2013లో జరిగిన అలహాబాద్ కుంభమేళా సందర్భంగా అక్కడి రైల్వేస్టేషన్లో తొక్కిసలాట జరిగి 36 మంది చనిపోయారు. 2014 -19 మధ్య ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి పుష్కరాల సందర్భంగా దాదాపు 30 మంది మరణించారు. తాజాగా ఈ ఏడాది జనవరిలో మళ్లీ ప్రయాగరాజ్ లో జరిగిన మహా కుంభమేళాలో అధికారిక లెక్కల ప్రకారం 30 మంది మరణించారు. ఇవన్నీ రకరకాల కారణాల చేత జరిగిన సంఘటనలు. అమృత స్నానాల కోసం, వెండి నాణెల కోసం, ప్రముఖుల తాకిడి కారణంగా సాధారణ భక్తుల భద్రతను పోలీసు బలగాలు గాలికి వదిలేసి కొద్దిమంది ప్రముఖుల సేవలో ఉండిపోవడంవల్ల జనం అదుపుతప్పి తొక్కిసలాటలు జరిగినవే. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాల సందర్భంగా అంతమంది చనిపోవడానికి కారణం అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తాను ఎంత దైవభక్తిపరుడో, సనాతనధర్మ రక్షకుడో చెప్పుకునేందుకు డాక్యుమెంటరీ సినిమా షూటింగ్ చేసిన కారణంగా జరిగిన తొక్కిసలాట అది.
1954లోనే నెహ్రూ చెప్పిన మాటలు ఈనాటి పాలకులు ఎవరి చెవినా పడుతున్నట్టు లేవు. పైగా నెహ్రూని పక్కా ఫ్యూడల్ అని, ఆయన కారణంగానే ఈ దేశం తాను ముఖ్యమంత్రి అయి దిశానిర్దేశం చేసేదాకా (1990ల వరకు) వెనకబడే ఉందని ప్రస్తుతం ఎన్‌డిఎ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ ఉంటారు. 1954లో నెహ్రూ కాలంనాటికి ప్రచార, ప్రసార సాధనాలు ఈ దేశంలో పెద్దగా లేవు. అప్పట్లో గుప్పెడన్ని వార్తాపత్రికలు ఉండేవేమో. ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే విశాల భారతదేశం అంతటికి ఆ వార్త చేరడం అంత సులభంగా ఉండేది కాదు. 2025లో నరేంద్ర మోడీ హయాంలో జరిగిన కుంభమేళా నాటికి ఈ దేశంలో ప్రచార, ప్రసార సాధనాల సాంకేతికత ఊహించని విధంగా విస్ఫోటనంవలే ఎల్లెడలా వ్యాపించి, క్షణాల మీద ఏ సమాచారం అయినా ఒక్క విశాల భారతదేశంలోనే కాక మొత్తం ప్రపంచానికే ఎరుకపరిచే విధంగా ఉన్నా సరైన సమాచారం ప్రజలకు చేరలేదు. నెహ్రూనాటి ప్రజాస్వామ్యానికి, నేటి నరేంద్ర మోడీ కాలంలోని ప్రజాస్వామ్యానికి ఈ తేడా మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అప్పట్లో ప్రచార సాధనాలు నిర్భయంగా, నిష్పక్షపాతంగా రాజకీయ, వ్యాపార లాభాపేక్ష లేకుండా పనిచేసేవి కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు సమాచారాన్ని అందించేవి. ప్రస్తుత ప్రజాస్వామ్యంలో స్వతంత్రంగా ఉన్నాం అని నిటారుగా నిలబడి చెప్పుకోగలిగిన ప్రచార ప్రసార సాధనాలు కనుమరుగైపోతున్నాయి.
ఇప్పుడు ఈ కుంభమేళాలలో జరిగిన సంఘటనల గత చరిత్ర తవ్వడం ఎందుకంటే మళ్లీ సినీ నటుడు విజయ్ కరూర్‌లో నిర్వహించిన రాజకీయ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట కారణంగా 40మంది చనిపోయిన సంఘటన మీద మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు. ఈ సంఘటన జరిగిన కారణంగా విజయ్ నాయకత్వానికి పనికి రాకపోతే పైన ఉదహరించిన సంఘటనలన్నిట్లో జరిగిన ప్రాణనష్టానికి ఎవరెవరు నాయకులుగా పనికిరాకుండా పోవాలో న్యాయవ్యవస్థ చెబితే బాగుంటుంది. విజయ్ ర్యాలీ లో తొక్కిసలాట జరిగిన తర్వాత నిర్వాహకులు అంటే ఆయన పార్టీవారు బాధ్యతారహితంగా ఆ ప్రాంతం విడిచి వెళ్లిపోయినందున న్యాయమూర్తి ఇటువంటి వ్యాఖ్యలు చేశారని ఎవరైనా సమర్థించవచ్చు. అందుకు న్యాయమూర్తి వ్యాఖ్యల్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. రాజకీయ ప్రముఖులు పాల్గొనే అనేక సభలలో సరైన ఏర్పాట్లు లేక అవస్థలు పడుతున్నవాళ్లు, కొన్ని సందర్భాలలో ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నవాళ్ళు సామాన్య ప్రజలు.
అప్పటికప్పుడు ఏదో తక్షణ స్పందనగా ఆ కుటుంబాలకు కొంత పరిహారం చెల్లిస్తూ ఉండవచ్చు కానీ తరువాత వారి భవిష్యత్తు గురించి ఆలోచించేవారు ఉండరు. అవి ధార్మిక కుంభమేళాలైనా, రాజకీయ కుంభమేళాలైనా, సినిమా వారి ప్రదర్శనలైనా, అత్యుత్సాహ క్రీడా ప్రదర్శనలైనా తేడా ఏం లేదు. ఇటీవలే వరుసగా జరిగిన కొన్ని సంఘటనలు గుర్తొస్తాయి. హైదరాబాదులో ఒక సినీ నటుడు తన సినిమా ప్రీమియర్ షోకి వెళ్లి తొక్కిసలాటకు కారకుడయి, ఒక సాధారణ యువతి మరణానికి కారణమైన సంఘటన కావచ్చు. క్రీడా ఉత్సాహం హద్దులు మీరి, కట్టలు తెంచుకుని ఐపిఎల్ లో తమ రాష్ట్ర జట్టు గెలిచిందన్న అత్యుత్సాహంతో బెంగళూరు స్టేడియంలో జరిగిన సంఘటన కావచ్చు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో జనం పెద్ద సంఖ్యలో వచ్చారన్నట్టు చూపించుకోవడానికి ఒక ఇరుకు ప్రదేశంలో సభ నిర్వహించిన కారణంగా జరిగిన తొక్కిసలాట కావచ్చు.. ఇలా ఏకరువు పెడుతూపోతే మద్రాస్ హైకోర్టు గౌరవ న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్టు చాలామందికి నాయకత్వ లక్షణాలు లేవనే విషయం నిర్ధారణగా చెప్పవచ్చు.
140 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో 2021 నాటి బడ్జెట్ లెక్కల ప్రకారం కేంద్ర రాష్ట్ర బలగాలతో కలిపి 26 లక్షల మంది మాత్రమే పోలీసులు ఉన్నారు. లక్షల సంఖ్యలో రాజకీయ సభలకు, కోట్లలో ధార్మిక మేళాలకు జనం వస్తే ఈ కొద్ది సంఖ్యలో ఉన్న పోలీసు బలగాల వల్ల భద్రతా ఏర్పాట్లు ఎలా సాధ్యం? ధార్మిక కార్యక్రమాలను ఎలాగూ ఆపలేరు. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పార్టీలు పైకి చెప్పేది మతసామరస్యం, సర్వమత సమానత్వం అయినా అసలు మాత్రం మతాల ఊతంగా నడుస్తున్నవే. కనీసం ఈ రాజకీయ మేళాలనైనా క్రమబద్ధీకరించే ప్రయత్నం జరగాలి. చట్టసభల్లో అది సాధ్యమవుతుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే బలప్రదర్శన రాజకీయ పార్టీలన్నిటి అవసరంగా మారిపోయిన రోజులవి. పోనీ వచ్చే జనమంతా నిజంగా నాయకుడో, ఆ పార్టీయో తమకు మంచి చేస్తుందని, తమ జీవితాల్ని బాగు చేస్తుందని నమ్మి స్వచ్ఛందంగా వచ్చి, తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా ఓట్లు వేస్తున్నారా అంటే ఆ నమ్మకమూ లేదు. రకరకాల కారణాల చేత, రకరకాల ఆకర్షణల కారణంగా సభలకు వస్తారు. మరిన్ని రకాల ప్రలోభాల కారణంగా తర్వాత ఓట్లు వేస్తారు. మొత్తంగా ఎన్నికల విధానంలో సమూల మార్పులు వస్తే ఈ రకపు బలప్రదర్శనలు వాటంతట అవే ఆగిపోతాయి, జనం బ్రతికి పోతారు. అదుపు చేయలేనంత, భద్రత కల్పించలేనంత మందిని ఒక దగ్గర జమ చేసి మాత్రమే నాయకుడు తాను ప్రజలకు చెయ్యదల్చుకున్న మంచిని గురించి చెప్పనవసరం లేదు. ప్రచార, ప్రసార సాధనాల్లో, వ్యవస్థల్లో వచ్చిన సాంకేతిక విస్ఫోటనాన్ని సక్రమ రీతిలో వాడుకుంటే సరిపోతుంది. అప్పటివరకు అప్పుడప్పుడు న్యాయ వ్యవస్థ అయినా ఇలా మొట్టికాయలు వేయడం తప్ప చేయగలిగింది పెద్దగా ఉండదేమో!