రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాల ఏర్పాటు కోసం ఇప్పటివరకు అబ్కారీ శాఖకు 447 దరఖాస్తులు వచ్చాయి. డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న నూతన మద్యం దుకాణాలకు ఇటీవల ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మద్యం దుకాణాలకు సంబంధించిన దరఖాస్తులను సెప్టెంబర్ 26 నుంచి స్వీకరిస్తున్నారు. శనివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 447 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. సోమవారం నుంచి అప్లికేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మేడ్చల్ యూనిట్ పరిధిలో ఉన్న 118 మద్యం దుకాణాలకు 20 దరఖాస్తులు వచ్చాయి. రిజర్వేషన్లు, దరఖాస్తు గైడ్‌లైన్స్ వివరాలను tgbcl.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల టెండర్లకు నోటిఫికేషన్‌ను విడుదల చేసి జిల్లాల వారీగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అక్టోబర్ 18వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
దుకాణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు : తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు అబ్కారీ శాఖ ఆన్‌లైన్‌లో దరఖాస్తులను అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త దుకాణాల టెండర్ల దరఖాస్తు ఫారాల సబ్ మిషన్ మాత్రం ఆఫ్ లైన్‌లోనే చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారాన్ని మాత్రం ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటిని పూర్తి చేసిన తరువాత ఆయా ఎక్సైజ్ జిల్లా కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన తరువాత అక్టోబర్ 23న కొత్త మద్యం దుకాణాల కేటాయింపునకు డ్రా తీస్తారు. డ్రాలో దుకాణాల లైసెన్స్ పొందిన వారు మొదటి విడత చెల్లింపు మొత్తాన్ని అక్టోబర్ 23 నుంచి చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారంతో పాటు రూ.3 లక్షల డీడీ,
లేదా రూ. 3 లక్షలు చలాన్ రూపంలో చెల్లించిన రశీదు జతపరచాల్సి ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. 2,620 మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతంగా రిజర్వేషన్లు కేటాయించారు. మొత్తం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు 786 దుకాణాలను కేటాయించారు. డీడీలు, చలాన్లను డీపీఓ (జిల్లా ప్రొహిబిషనర్ అండ్ ఎక్సైజ్ అధికారి) పేరున తీయాల్సి ఉంటుందని తెలిపారు. కొత్త దుకాణాలకు డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాల పరిమితి ఉంటుంది. డ్రా పద్ధతిలో ఎంపికైన వారు డిసెంబర్ 1వ తేదీ నుంచి దుకాణాలను తెరచుకోవచ్చు. గతంలో రూ.2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫారం ధరను ఈ ఏడాది రూ.3 లక్షలుగా నిర్ణయించారు. ఈమొత్తం సొమ్ము నాన్ రిఫండబుల్‌గా ఉంటుంది.