నవమాసాలు మోసి కన్నతల్లిని కంటికి రెప్పల కాపాడుకోవాల్సిన కొడుకు ఆమెనే కడతేర్చాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా, మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, సిఐ మధు కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఆరుట్ల గ్రామానికి చెందిన మానుపాటి సోమయ్య, ఐలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. వీరి ముగ్గురి పెళ్లిళ్లు అయ్యాయి. తల్లి ఐలమ్మ తమ కులవృత్తి గంపలు, అల్లికల పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. ఆమె పెద్ద కొడుకు శ్రీకాంత్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా మద్యానికి బానిసైన శ్రీకాంత్ డబ్బుల కోసం తల్లితో తరచూ గొడవ పడుతున్నాడు. ఏ పని చేయకుండా ఆవారాగా గ్రామంలో తిరుగుతూ శుక్రవారం రాత్రి మద్యం తాగడం కోసం తల్లిని డబ్బుల కోసం డిమాండ్ చేశాడు. ఆమె లేవని చెప్పడంతో కోపంతో పక్కనే ఉన్న ఇనుప సుత్తితో తలపై కొట్టడంతో తల పగిలి ఆమె తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను నగరంలోని కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. శవపరీక్ష కోసం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.