తేజా సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిరాయ్’. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తొమ్మిది శక్తివంతమైన గ్రంథాలను దక్కించుకొని అమరత్వం సాధించి ప్రపంచాన్ని జయించాలనుకునే ఓ దుష్టశక్తిని, హీరో ఎలా అంతం చేస్తాడనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకులకు మరింత చేరువ కానుంది. ఈ సినిమా త్వరలోనే ఒటిటిలో సందడి చేయనుంది.
ప్రముఖ ఒటిటి సంస్థ జియో హాట్‌స్టార్‌లో మిరాయ్ అక్టోబర్ 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఒటిటి సంస్థ సోషల్‌మీడియా ద్వారా పంచుకుంది. ‘‘తొమ్మిది గ్రంథాలు, ఒక అంతులేని శక్తి, ఈ బ్రహ్మంఢాన్ని కాపాడటానికి ఒక సూపర్‌యోధ. మిరాయ్, ఇండియా యొక్క సూపర్‌హీరో మీ ఇంటికి వస్తున్నాడు’’ అంటూ హాట్‌స్టార్ పేర్కొంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించింది. శ్రియ సరన్, జగపతిబాబు, జయరామ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. గౌర హరి సంగీతం అందించారు.