హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర డిజిపిగా నియమితులై బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తన స్వగ్రామం పెద్దతుండ్లకు బత్తుల శివధర్ రెడ్డి విచ్చేశారు. ఈ దంపతులకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. డప్పులు, డోళ్లు , భజంత్రీలు , బాణాసంచాలతో గ్రామస్తులంతా కలిసి వారిని దసరా ఉత్సవాలకు ఆహ్వానించారు. గ్రామంలో నిర్వహించిన భారీ దసరా ఊరేగింపులో శివధర్ రెడ్డి దంపతులు , కుటుంబీకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జమ్మిపూజ నిర్వహించిన తర్వాత గ్రామంలోని ప్రసిద్ధ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి తదుపరి దుర్గామాతకు శివధర్ రెడ్డి హేమలత దంపతులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పెద్దతుండ్ల గ్రామస్థులతో డిజిపి ముచ్చటించారు.