ప్రాణాలకు తెగించి మహిళ ప్రయాణికురాలిని కాపాడిన మహిళా కానిస్టేబుల్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. వివరాల్లోకి వెలితే… చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో పి.విజయ (24) మహిళ ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుంది. గురువారం చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విధులు నిర్వహిస్తుంది. ముంబయి నుంచి విశాఖపట్టణం వెళుతున్న 18519 ట్రైన్ 12:30 గంటల సమయంలో చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ట్రైన్ ఆగిన వెంటనే ముంబయికి చెందిన జేబా అమిరుల్ (26) రైలు దిగి తినుబండరాలు కొనుకునేందుకు ప్లాట్‌ఫాం నెంబర్ 04లోని షాపుకు వెళ్లింది. తినుబండరాలు తీసుకుని వచ్చేసరికి ట్రైన్ కదిలింది. దీంతో ఎలాగైన ట్రైన్‌ను అందుకోవాలని కదులుతున్న రన్నింగ్ ట్రైన్ ఎక్కుతూ కాలు జారి పట్టాలపై పడిపోయింది.
అక్కడే డ్యూటీలో ఉన్న విజయ తన ప్రాణాలను పణంగా పెట్టి జేబా అమిరుల్‌ను పైకి లాగింది. దీంతో ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా కాపాడింది. కాపాడే క్రమంలో విజయకు చిన్నచిన్న గాయాలయ్యాయి. వెంటనే రైల్వే అధికారులు రైలును అపి జేబాఅమిరుల్‌ను ట్రైన్ ఎక్కించి పంపించారు., ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణికురాలిని కాపాడిన విజయను చర్లపల్లి రైల్వేస్టేషన్ ఆర్‌పిఎఫ్ సిఐ రమేష్, డిఎస్‌పి నవీన్‌కుమార్, రైల్వే అధికారులు అభినందించారు. కదిలే ట్రైన్ ఎక్కడం ప్రమాదకరమని ప్రయాణికులు గమనించాలని ఈ సందర్భంగా రైల్వే అధికారులు తెలిపారు.