కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు ప్రాంతంలో ఏటా దసరా రోజున జరిగే బన్ని ఉత్సవం ఈసారి హింస చెలరేగింది. దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్న ఈ కర్రల సమరంలో ఇద్దరు మృతి చెందగా, వందమందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దేవరగట్టు కొండపై వెలసిన మాళమల్లేశ్వరస్వామి ఆలయం దసరా పర్వదినాన ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. ప్రతి సంవత్సరం అర్థరాత్రి మాళమ్మ, మల్లేశ్వరస్వామి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. అనంతరం దేవ మూర్తుల విగ్రహాలను పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురుబసవన్న గుడి మీదుగా ఊరేగిస్తారు. ఈ ఊరేగింపు సమయంలోనే విగ్రహాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రెండు వర్గాలు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేస్తారు. దీనినే స్థానికంగా బన్ని ఉత్సవం లేదా దేవరగట్టు కర్రల సమరం అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా హింస జరగకుండా అడ్డుకునేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికలు వేసింది. సుమారు 700 మంది పోలీసులను మోహరించారు. దేవరగట్టు పరిసరాల్లో సిసి కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. కానీ తీసుకున్న అన్ని జాగ్రత్తలు విఫలమయ్యాయి.