ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలో బాంబు పెట్టారని, నాలుగు ప్రాంతాలలో ఆర్డీఎక్స్ పదార్థాలతో పేలుళ్లకు పాల్ప డతారని రెండు అనుమానాస్పదమైన ఈమెయిల్స్ పోలీసులకు వచ్చాయి. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ఇళ్లను టార్గెట్ చేసి రెండు ఆర్‌డిఎక్స్ బాంబులు దాచినట్టు మెయిల్‌లో హెచ్చరిక ఇచ్చారు. తమిళనాడులోని తిరు వళ్లూరు జిల్లా నుంచి ఈ కుట్ర రూపొందుతోందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు సూచించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు వివిధ ప్రాంతాలలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలను చేపట్టాయి. సిఎం చంద్రబాబు, జగన్ ఇళ్ల వద్ద సెక్యూరిటీ పెంచారు. తిరువళ్లూరు కేంద్రంగా ఐఎస్‌ఐ మాజీ ఎల్టిటిఇ మిలిటెంట్లు తిరుపతిలో విధ్వం సం సృష్టించడానికి కుట్ర చేస్తున్నారని, ఇందులో భాగంగానే నాలుగు చోట్ల బాంబులు పెట్టి పేలుళ్లను జరపనున్నారని పేర్కొన్నారు. ఈ మెయి ల్స్‌తో అప్రమత్తమైన పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. బాంబు బెదిరింపులతో అడుగడుగున బాండ్ స్కాడ్ బృందాలు జల్లెడ పట్టాయి. ప్రధానం గా తిరుపతి లోని ఆర్‌టిసి బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిలతీర్థం ఆలయం, గోవిందరాజస్వామి వారి ఆలయం,
కోర్టు ప్రాంగణం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుమల, శ్రీకాళహస్తి దేవస్థానాలలో కూడా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. తిరుపతితో పాటు తమిళనా డులోని వ్యక్తులకు ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చినట్లుగా గుర్తించారు. నటి త్రిషతో పాటు తమిళనాడులోని పలువురు రాజకీయ ప్రము ఖుల ఇళ్లకు సైతం బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. తమిళనాడు ముఖ్యమంత్రి నివాసంతో పాటు రాజ్ భవన్, తమిళనాడు భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్ట్రర్స్ సహా కొందరు ప్రముఖులకు బెదిరింపు ఫోన్స్ వచ్చాయి. చివరకు అవి ఫేక్ కాల్స్ అని తేలాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సెర్చ్ ఆపరేషన్స్ వల్ల ప్రజలు భయాందోళనలకు గురి అయ్యారు. తిరుపతిలోనూ బాంబు పేలుళ్ల పేరుతో వచ్చినవి ఫేక్ మెయిల్స్ గానే పోలీసులు అనుమానిస్తు న్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్‌పి సుబ్బారాయుడు మాట్లాడు తూ, ‘పలు రాష్ట్రాల్లో ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయి. అదే తరహాలో తిరుపతి జిల్లాకు కూడా బెదిరింపు వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు లోనుకావద్దు. అనవసరమైన అపోహలను, ఊహాగానాలను నమ్మవద్దు,‘ అని స్పష్టం చేశారు. పోలీసులు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఆయన వివరించారు.
భద్రతా బలగాల అప్రమత్తం
కాగా ఎపి సిఎం చంద్రబాబు ఈనెల ఆరవ తేదీన తిరుపతి పర్యటనకు రానున్నారు. ఈ క్రమంలో తాజా బాంబు బెదిరింపులతో భద్రతా బృందా లు మరింత అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద కూడా భద్రతా బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ఇక ఈ మెయిల్స్ పైన తిరుమల పోలీసులు, ఇంటిలిజెన్స్ విభాగం, సైబర్ సెక్యూరిటీ విభాగాలు కలిసి దర్యాప్తు చేస్తున్నా యి. బాంబు బెదిరింపుల నేపథ్యంలో తిరుపతిలో పోలీసుల గస్తీ బాగా పెంచారు.