అహ్మదాబాద్: రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్.. భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ దశలో కెప్టెన్ ఛేజ్, హోప్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. ఇద్దరు కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పాలని ప్రయత్నించారు. కానీ, భారత బౌలర్ల ముందు వాళ్ల ఆశలు ఫలించలేదు.
హోప్(26)ని కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కొంత సమయానికే ఛేజ్(24) సిరాజ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో జెస్టిన్ గ్రీవ్స్ పరుగులు రాబట్టేందుకు కృషి చేశాడు. కానీ, అతని ప్రయత్నాన్ని బుమ్రా విఫలం చేశాడు 32 పరుగుల వద్ద గ్రీవ్స్ బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 44.1 ఓవర్లలో వెస్టిండీస్ 162 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలింగ్‌లో సిరాజ్ 4, బుమ్రా 3, కుల్దీప్ 2, సుందర్ 1 వికెట్ తీశారు.