తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జివి ప్రకాశ్‌కుమార్, గాయని సైంధవిలకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. జివి ప్రకాష్, సైంధవి 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 4 సంవత్సరాల కుమార్తె ఉంది. 12 సంవత్సరాలు కలిసి జీవించిన తర్వాత, అభిప్రాయ భేదాల కారణంగా 2024 లో విడిపోతున్నట్లు వారు ప్రకటించారు. ఆ తరువాత, ఇద్దరూ మార్చి 24న చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. కేసును విచారించిన ఫ్యామిలీ కోర్టు, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి వారిద్దరికీ 6 నెలల సమయం ఇచ్చింది.
ఆరు నెలల వ్యవధి ముగిసిన తర్వాత, సెప్టెంబర్ 25 న చెన్నై ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి సెల్వ సుందరి ముందు కేసు మళ్ళీ విచారణకు వచ్చింది. ఆ సమయంలో జివి ప్రకాష్, సైంధవి స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. కలిసి జీవించడం ఇష్టం లేదని, విడివిడిగా జీవించాలనుకుంటున్నారని కోర్టుకు తెలిపారు. దీంతో మంగళవారం ఫ్యామిలీ కోర్టు జడ్జి సెల్వ సుందరి వీరికి విడాకులు మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించారు.