రాష్ట్రానికి కొత్తగా నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం శుభపరిణామమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా 35 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించగా, అందులో నాలుగు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం సంతోషకరమని ఆయన బుధవారం ట్వీట్ చేశారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోడికి, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో, ములుగు జిల్లా కేంద్రం (గిరిజన ప్రాంతం)లో, జగిత్యాల రూరల్ మండలంలోని చెల్గలలో, వనపర్తి జిల్లా నాగవరం శివారులో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నదని ఆయన వివరించారు. ఇంకా నాలుగు వందల కోట్ల రూపాయలతో 832 పిఎం-శ్రీ పాఠశాలలను మంజూరు చేసిందని ఆయన తెలిపారు. వెయ్యి కోట్ల రూపాయలతో ములుగు జిల్లాలో సమ్మక్క-సారక్క సెంట్రల్ లైబ్రరీ విశ్వవిద్యాలయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.