ఢిల్లీ: అసత్యంపై సత్యం.. అన్యాయంపై న్యాయం.. అధర్మంపై ధర్మం గెలుస్తుందని, భారత ప్రధాని నరేంద్ర మోడి తెలిపారు. దేశానికి సేవ చేసేందుకు సంఘ్ కార్యకర్తలు ఎప్పడూ ముందుంటారని అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలకు మోడి హాజరయ్యారు. రూ.వంద నాణెం, పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మోడి మీడియాతో మాట్లాడుతూ.. శతాబ్ది వేడుకలు చేసుకుంటున్న ఆర్ఎస్ఎస్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం మహర్నవమి శుభదినం అని గురువారం విజయదశమి అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరారు. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. నది తన ప్రవాహంలో అనేక భూముల్లో పచ్చదనం పెంచుతుందని, నది ప్రవాహంలా ఆర్ఎస్ఎస్ కూడా ప్రజలకు సేవ చేస్తోందని చెప్పారు.
విద్య, వైద్యం, రైతులకు అనేక విధాలుగా సంఘ్ సేవలు అందిస్తోందని, మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు సంఘ్ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ఆర్ఎస్ఎస్ చేసే ప్రతి పనిలో ఒకటే కనిపిస్తోందని.. అదే నేషనల్ ఫస్ట్ అని మోడి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ.. ప్రతి ఒక్కరి నినాదం కావాలని, వోకల్ ఫర్ లోకల్ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. సామాజిక న్యాయం కల్పన దిశగా కార్యక్రమాలు రూపొందిస్తున్నామని, భిన్నత్వంలో ఏకత్వం అనేదే మన బలమని తెలియజేశారు. భారత సంస్కృతికి మూలం మన కుటుంబ విలువలేనని, కుటుంబంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలు సమర్థంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి ఇంట్లో పెద్దలను గౌరవించాలని.. పిల్లలను ప్రోత్సహించాలని.. ప్రతి ఒక్కరూ తమ బాధ్యత చిత్తశుద్ధితో నిర్వహిస్తేనే వికసిత్ భారత్ సాధ్యమని మోడి స్పష్టం చేశారు.