పదేళ్ల పాలనలో బిఆర్‌ఎస్ దోపిడీ చేస్తే…22 నెలల కాలంలోనే కాంగ్రెస్ మోసాలకు తెగబడిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ శ్రేణుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసి విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం మొదలైందని, ముందు జడ్‌పిటిసి అభ్యర్థులను డిక్లేర్ చేయడం, ఏకగ్రీవంగా ఉన్న చోట బి.ఫాం ఇవ్వడం, వార్డు మెంబర్ నుండి జడ్‌పిటిసి దాకా అన్ని స్థానాల్లో పోటీ చేసి అత్యధిక స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌కు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన పార్టీ బిఆర్‌ఎస్ అని మండిపడ్డారు. కేంద్ర నిధులను దారిమళ్లించి గ్రామాలను దెబ్బతీసిందని ఆరోపించారు. ఆ పార్టీ పాలనలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి కల్పించారన్నారు. తాజా మాజీ సర్పంచులు పడిన యాతన వర్ణణాతీతం అన్నారు. పంచాయతీలకు కరెంట్ బిల్లులు కూడా కట్టలేని దుస్థితితెచ్చారని అన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అనేక వాగ్ధానాలు చేసిందని, రైతు భరోసా ఇయ్యడం లేదని మండిపడ్డారు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం క్రమం తప్పకుండా రైతుల అకౌంట్లో నిధులు జమ చేస్తోందని, ఉచితంగా బియ్యం అందిస్తోందని, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని అన్నారు. రోడ్లు, నర్సరీలు, ఇంటింటికీ నీళ్లు సహా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతో జరుగుతున్నవే అని పేర్కొన్నారు. తమ పార్టీ మాత్రం అభివృద్ధిపైనే మాట్లాడుతోందని, అందువల్లనే స్థానిక ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను ఆదరించాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నానని అన్నారు. బిజెపి అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలకు మరిన్ని కేంద్ర నిధులు తీసుకొస్తాం అని అన్నారు. గ్రామాలు బాగుపడాలంటే బిజెపిని గెలిపించాలని పిలుపునిచ్చారు. 42 శాతం రిజర్వేషన్ల సవరణ అప్పుడే చేస్తే ఈ సమస్య వచ్చేది కాదన్నారు. స్థానిక ఎన్నికలు నిర్వ హించాలనే చిత్తశుద్ధి లేదు కాబట్టే రెండేళ్ల జాప్యం చేశారన్నారు. హైకోర్టు ఆదేశించినందునే తప్పనిసరై ఇష్టం లేకపోయినా ఎన్నికలు నిర్వహిస్తున్నారని అన్నారు. కేంద్ర నిధుల కోసమే ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
బిసి రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం..
తమ పార్టీ బిసి రిజర్వేషన్లకు కట్టుబడి ఉందన్నారు. ఎన్నికలు జరగాలన్నదే తమ పార్టీ అభిమతం అన్నారు. కోర్టుకు కాంగ్రెస్ నేతలే వెళ్లినట్లుందని ఆరోపించారు. రాజ్యాంగ బాధ్యతను కాంగ్రెస్ తీసుకోవాలన్నారు. ఎన్నికలు జరిపి తీరాలని కోరుతున్నా..దేశంలో రిజర్వేషన్లకు సంబంధిం చి వివిధ రాష్ట్రాల్లో అనేక సామాజిక సమస్యలు ఉంటాయని గుర్తు చేశారు. రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదే అన్నారు. రాష్ట్రంలో బిసి=ఇ ముస్లింలకు సంబంధించినదే అన్నారు. ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్‌కు మాత్రమే ఆనాడు పరిమితం చేశారన్నారు. కానీ ఈనాడు వాళ్లకు రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తున్నారన్నారు. దీనికి తమ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు. స్థానిక ఎన్నికలపై కోర్టు ఏ విధంగా స్పందిస్తోందో వేచిచూడాలన్నారు. కోర్టు తీర్పును ముందుగా ప్రిడిక్ట్ చేయలేం అని అన్నారు.
కాళేశ్వరంలో బిఆర్‌ఎస్ అవినీతికి పాల్పడిందిః
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బిఆర్‌ఎస్ అవినీతి పాల్పడిందన్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం విచారణ చేయాలన్నారు. కానీ మేడిగడ్డ, సుందిళ్లకే పరిమితం చేయడం సరికాదన్నారు. ఎన్‌డిఎస్‌ఎ ఇచ్చిన నివేదిక ప్రకారం వాటిని రిపేర్ చేయాలన్నారు.పార్టీ ఫిరాయింపులకు తమ పార్టీ వ్యతిరేకం అన్నారు. పార్టీని వీడేటప్పుడు రాజీనామా చేయాలన్నదే తమ అభిమతం అన్నారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, ఎంఎల్‌ఎసి అంజిరెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.