టీమిండియా క్రికెటర్ దీప్తి శర్మ సరికొత్త రికార్డు నెలకొల్పింది. మహిళల వన్డే ప్రపంచకప్ లో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్ లో భారత జట్టు, శ్రీలంకను ఓడించి టోర్నీలో బోణి కొట్టింది. ఈ మ్యాచ్ లో అద్భుత ఆల్ రౌండర్ ప్రదర్శన చేసిన దీప్తి శర్మ.. తొలి భారత మహిళా క్రికెటర్ గా అరుదైన ఘనత సాధించింది. ఓ దశలో సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును తీరిగి పోటీలో నిలబెట్టింది. అమన్ కౌర్ తో కలిసి జట్టును ఆదకుంది. వీరిద్దరూ అర్ధ సెంచరీలో సాధించడంతో భారత్ మంచి స్కోరు సాధించగలిగింది. అమన్ కౌర్ 58 పరుగులు చేయగా.. దీప్తి శర్మ 53 పరుగులతో రాణించింది. అంతేకాదు.. బౌలింగ్ లోనూ చెలరేగి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. దూకుడుగా ఆడుతున్న శ్రీలంక కెప్టెన్ తోపాటు మరో రెండు కీలక వికెట్లు తీసి సత్తా చాటింది. ఇలా ఒక వరల్డ్ కప్ మ్యాచ్ లో అర్ధ సెంచరీ చేసి.. మూడు వికెట్లు తీసిన ఏకైక టీమిండియా మహిళా క్రికెటర్ గా దీప్తి నిలిచింది. అయితే, వన్డేలలో ఈ ఫీట్ సాధించడం ఆమెకు ఇది రెండోసారి.
కాగా, మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 47 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. దీప్తి (53), అమన్‌జోత్ (57) హాఫ్ సెంచరీలతో మెరిశారు. హర్లిన్ డియోల్(48), ప్రతిక రావల్(37) కెప్టెన్ హర్మన్‌ప్రీత్(21) పరుగులు చేశారు. వర్షం వల్ల మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 45.4 ఓవర్లలో 211 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీప్తి మూడు, శ్రీచరణి, స్నేహ్ రాణా రెండేసి వికెట్లను పడగొట్టారు. లంక బ్యాటర్లలో కెప్టెన్ చమరి ఆటపట్టు (43), నీలాక్షి (35) మాత్రమే కాస్త రాణించారు.