సరిగ్గా రెండేళ్ల క్రితం మొదలై, ఇప్పటికీ రావణకాష్టంలా రగులుతున్న ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి తెరదించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో రూపొందిన 20 సూత్రాల ప్రణాళిక.. గాజాలో శాంతి దిశగా పడిన ఓ ముందడుగుగా అభివర్ణించవచ్చు. ప్రణాళికలో పేర్కొన్న అంశాలను గమనిస్తే, కొంత కాలంగా దీని రూపకల్పన కోసం ట్రంప్ బృందం ఎంతగా కసరత్తు చేసిందో అర్థమవుతుంది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకు వచ్చిన దేశదేశాల ప్రతినిధులు ఇజ్రాయెల్ వైఖరిని దునుమాడటం, గాజాలో జరుగుతున్న నరమేధం పట్ల ఆందోళన వ్యక్తం చేయడం.. అంతకుమించి పాలస్తీనాను స్వతంత్ర దేశంగా 150కి పైగా దేశాలు గుర్తించడం వంటి పరిణామాల నేపథ్యం లో ట్రంప్ ఈ ప్రణాళక రూపకల్పనను కాస్త త్వరగా ముగించినట్లుగా క నిపిస్తోంది. సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కలసి తన 20 సూత్రాల ప్రణాళికను ట్రంప్ ప్రకటించడాన్ని బట్టి, నెతన్యాహును నయానో భయానో ఒప్పించి దారికి తెచ్చినట్లుగా కూడా కనబడుతోంది. పనిలో పనిగా, దోహాపై దాడి చేసినందుకు ఆయనతో ఖతార్‌కు క్షమాపణ చెప్పించినందుకు కూడా ట్రంప్ ప్రశంసనీయుడే. అమెరికా ప్రకటించిన 20 సూత్రాల ప్రణాళికలో అనేక అంశాలు పాలస్తీనాకు అనుకూలంగా ఉన్నాయనే మాట వాస్తవం.
గాజా పునర్నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు, రోజుకు 600 ట్రక్కులలో మానవతాసాయాన్ని అందించడం, గాజాలో కీలక మౌలిక వసతుల తక్షణ కల్పన, గాజా పునర్నిర్మాణంతో పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, ఉపాధి కల్పనకు తోడ్పాటు అందించడం, ఇకపై గాజాను, ఇతర ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించకుండా ఉండటం వంటి అంశాలు గాజావాసులకు ఊరటనిచ్చేవే. ఒప్పందం అమలులోకి వచ్చిన మరుక్షణమే ఇరుపక్షాలనుంచి బందీల విడుదల, గాజా నుంచి ఇజ్రాయెల్ సైనికులు వైదొలగడం వంటివి కూడా చెప్పుకోదగిన అంశాలే. ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకరించినట్లు స్వయంగా ట్రంప్ చెబుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ సూచించిన విధంగా ప్రణాళికలో మార్పులు చేర్పులు చేసి, ఆ పిమ్మటే బహిరంగపరిచినట్లు భావించవచ్చు. కానీ, హమాస్ ప్రతినిధులతో సంప్రదించకుండా ఏకపక్షంగా రూపొందించిన ఈ ప్రణాళికపట్ల వారి స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారింది. పైగా ప్రణాళికను తమకు పంపడానికి ముందే మీడియాకు వెల్లడించడంతో హమాస్ నేతలు కినుకగా ఉన్నట్లు సమాచారం. ఇకపై గాజా పాలనలో హమాస్ ప్రమేయం లేకపోవడం, గాజాలో అంతర్జాతీయ సుస్థిర బలగాలను మోహరించడం, బోర్డ్ ఆఫ్ పీస్ పేరిట గా జాలో తాత్కాలిక పరిపాలన వ్యవస్థ ఏర్పాటు వంటి ప్రతిపాదనలకు హ మాస్ అంగీకరించకపోవచ్చు.
పాలస్తీనాకు స్వీయ నిర్ణయాధికారం లేకపోతే ఈ ప్రణాళికను ఒప్పుకునే ప్రసక్తి లేదంటూ ఇప్పటికే ఒక హమాస్ నేత స్పందించిన తీరును బట్టి అంత తేలిగ్గా హమాస్ అమెరికా ప్రతిపాదనలకు తల ఊపకపోవచ్చు. కాబట్టి, తమకు నచ్చని ప్రతిపాదనలను సవరించాలంటూ కోరే అవకాశం ఉండవచ్చు. అన్నింటికీ మించి, ఈ ప్రణాళిక అమలుకు కాల పరిమితి గానీ, ఒప్పందాన్ని హమాస్ అంగీకరించేందుకు గడువు గానీ విధించని ట్రంప్, ప్రణాళికను హమాస్‌కు పంపించాక మూడు, నాలుగు రోజుల్లో ప్రతిస్పందించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరించడం హమాస్‌పై ఒత్తిడిని పెంచే వ్యూహంలో భాగమే. ఒప్పందం అమలు పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశాభావంతో ఉన్నారు. యుద్ధ విరమణకు జరిగిన చర్చల్లో మధ్యవర్తులుగా పాల్గొన్న ఈజిప్టు, ఖతార్ దేశాల ప్రతినిధులు కూడా ఈ ప్రణాళికపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితిలో తాను చేసిన ప్రసంగానికి భిన్నంగా ట్రంప్ ఈ ప్రణాళికను ముందుకు తెచ్చారు. తాను ఏడు యుద్ధాలను నివారించానని చెప్పుకున్న అగ్రరాజ్యాధినేత, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం గురించి సమితి వేదికపై పెద్దగా మాట్లాడింది లేదు. బహుశా, అప్పటికి ఈ 20 సూత్రాల ప్రణాళికకు కసరత్తు చివరి దశలో ఉండటమే అందుకు కారణంకావచ్చు. అధ్యక్ష పదవి చేపట్టక ముందునుంచే రష్యా- ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాలను నిలువరిస్తానంటూ బీరాలు పలికిన ట్రంప్‌కు తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవన్న వాస్తవం ఇన్నాళ్లకైనా బోధపడినందుకు సంతోషించాలి.
ప్రపంచ దేశాలనుంచి పరోక్షంగా ఎదురవుతున్న ఒత్తిడికి తలవంచి, గాజాలో నరమేధాన్ని నిలువరించేందుకు ఒక పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వచ్చినందుకు ఆయన అభినందనీయుడు. ట్రంప్ శాంతియత్నాలు ఫలించి, హమాస్ సైతం ముందుకొచ్చి, తాజా ప్రణాళికకు సుముఖత వ్యక్తం చేస్తుందని ఆశిద్దాం. ఇదే విధంగా రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి కూడా ట్రంప్ ముగింపు పలకగలగితే, తాను ఆశించిన విధంగా నోబెల్ బహుమతి దక్కినా ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు.