కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ముస్లిం మైనారిటీ మంత్రి లేరని, అదే కేసీఆర్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో అన్ని మతాలకు గౌరవం దక్కిందని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మైనారిటీ డిక్లరేషన్లో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లో ఒక దర్గాను, రెండు స్మశాన వాటికలను బుల్డోజర్లు పెట్టి తొలగించారని చెబుతూ ఇదేనా కాంగ్రెస్ మార్కు సెక్యులరిజమని ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం బిల్లును దేశంలో మొదటి రాష్ట్రంగా తెలంగాణలో అమలు చేశారని చెప్పారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం బిల్లును కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా వ్యతిరేకించిందని అన్నారు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని ఫాలో కావడంలేదని, మోడీ రాజ్యాంగాన్ని రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలోనే ముస్లింలకు న్యాయం జరిగిందని తెలిపారు.