ఆసియా కప్ ట్రోఫీని టీమిండియాకు అప్పగించడానికి పాకిస్తాన్ అంతర్గత మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ షరతు విధించినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇటీవల దుబాయి వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ ఉత్కంఠ విజయం సాధించింది. మ్యాచ్ తర్వాత అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా ఎసిసి ఛైర్మన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోబోమని భారత ఆటగాళ్ళు తెలిపారు. దీంతో అవార్డు ప్రదానోత్సవం కొన్ని గంటలు ఆలస్యం అయింది. నఖ్వీ కూడా వేరొకరి చేతుల మీదుగా ట్రోఫీని అందించడానికి అంగీకరించలేదు. ఈ క్రమంలో భారత ఆటగాళ్ళు ట్రోఫీ లేకుండా తమ చేతులతో ఫోటోలు దిగుతూ సంబరాలు చేసుకున్నారు. అయితే, భారత ఆటగాళ్లకు ట్రోఫీని, మెడల్స్ ను ఇవ్వకుండా నఖ్వీ తీసుకెళ్లిపోయాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బిసిిసిఐ.. ఐసిసికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది. దీనిపై స్పందించిన నఖ్వీ.. ఆసియా కప్ ఇవ్వాలంటే భారత్ కు ఓ షరతు విధించినట్లు తెలుస్తోంది. మళ్లీ అధికారిక అవార్డు ప్రదానోత్సవం నిర్వహిస్తే.. అందులో ట్రోఫీని ప్రదానం చేస్తానని నఖ్వీ పేర్కొన్నట్లు నివేదికలు తెలిపాయి.
కాగా, పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా, ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌ను భారత్ బహిష్కరించాలని దేశంలోని వివిధ వర్గాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆసియా కప్‌లో భారత జట్టు పాకిస్తాన్‌పై లీగ్, సూపర్ 4 రౌండ్లలో పాక్ జట్టును చిత్తుగా ఓడించింది. దీంతో పాక్ కు టీమిండియా తగిన బుద్ది చెప్పిందని అందరూ ప్రశంసించారు. ఈ మ్యాచ్‌ల సమయంలో, భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయకపోవడం వివాదానికి దారితీసింది. పాకిస్తాన్ టీమిండియాపై ఐసిసికి ఫిర్యాదు కూడా చేసింది.
ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మరోసారి ఫైనల్ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ ఉత్కంఠ పోరులో తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన చేయడంతో.. భారత్ 5 వికెట్ల తేడాతో పాక్ ను ఓడించి తొమ్మిదో సారి ఆసియా కప్ ట్రోఫిని గెలుచుకుంది.