అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సర్కార్ షట్ డౌన్ కారణంగా అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆరేళ్లలో ఇలాంటి పరిస్థతి ఎదురుకావడం ఇదే ప్రథమం. ప్రభుత్వ కార్యకలాపాలు, సేవలు కొనసాగించే గడువు బుధవారం లోగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, కాంగ్రెస్ ఒక ఒప్పందానికి రావడంలో విఫలమైన కారణంగా షట్ డౌన్ ఎదురైంది. దీంతో ప్రభుత్వ కార్యకలాపాలు స్థంభించి, అనిశ్చిత పరిస్థితి ఎదురైంది. దాదాలు ఏడున్నర లక్షల మంది ఫెడరల్ ఉద్యోగుల భవితవ్యం చిక్కుల్లో పడింది. వీరిలో కొందరిన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తొలగించే ప్రమాదం ఉంది. ప్రతీకార చర్యలకు దిగుతానని ప్రెసిడెంట్ తీవ్ర హెచ్చరిక చేయడంతో మరింత గందరగోళం నెలకొంది. సైన్యం, ట్రాఫిక్ కంట్రోల్ , మెడికేర్ వంటి అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతున్నాయి.ట్రంప్ ఏకపక్షంగా తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలవల్ల, విద్య, పర్యావరణం, ఇతర సేవలు దెబ్బతింటున్నా, ఆయన వెనక్కి తగ్గేదేలే అన్నట్లు ఉన్నారు.
ఫలితంగా దేశం ఆర్థికంగా చిక్కుల్లో పడుతుందని పలువురు భయపడుతున్నారు. కాగా, తాను షట్ డౌన్ కోరుకోవడం లేదని ట్రంప్ గడువు ముగియడానికి ముందు అర్థరాత్రి వైట్ వౌస్ వద్ద ఓ ప్రకటన చేశారు. కీలకమైన బిల్లులకు ఆమోదం లభించక పోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ట్రంప్ కాంగ్రెస్ నాయకత్వంతో ఏకాంతంగా సమావేశమైనా, డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఓ ఒప్పందంపై చర్చలు జరపలేకపోవడంతో ఈ షట్ డౌన్ అనివార్యమైంది.అమెరికా ప్రెసిడెంట్ గా మొదటి టర్మ్ లో ట్రంప్ రెండుసార్లు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నా, రెండో టర్మ్ లో ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే మొదటి సారి.ట్రంప్ సర్కార్ ను ఇబ్బందుల పాలు చేసేందుకే డెమోక్రాట్లు ఈ పోరాటాన్ని ఎంచుకున్నారు. దేశవ్యాప్తంగా బీమా ప్రీమియం లను పెంచడాన్ని నిరసిస్తూ, లక్షలాదిమందికి అఫర్టబుల్ కేర్ చట్టం కింద, ఆరోగ్య సంరక్షణ నిధులను గడువు ముగియకముందే అందించాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు.
రిపబ్లికన్లు ట్రంప్ వెనక్కి తగ్గరాదని, ప్రస్తుతానికి చర్చలు జరపరాదని గట్టిగా కోరుతున్నారు. సుదీర్ఘకాలం షట్ డౌన్ కొనసాగకుండా నివారించేందుకు నిర్మాణాత్మక చర్యలు మాత్రం రెండు పక్షాలు చేపట్టడం లేదు ఈ పరిణామాలు రాజకీయాలకే పరిమితం కావడం లేదు. చెల్లింపుల వల్ల కలిగే ప్రయోజనాలు, పని ఒప్పందాలు ఇతర సేవలకోసం ప్రభుత్వం పై ఆధారపడే అమెరికన్ల జీవితాలను గందరగోళంలో పడేస్తున్నాయి. ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించడంతో దేశవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని ఆందోళన చెందుతున్నారు.అమెరికాలో షట్ డౌన్ మొదలైతే ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేరు. 1981 నుంచి అమెరికాలో 15 సార్లు షట్ డౌన్ లు జరిగాయి. ట్రంప్ హయాంలో షట్ డౌన్ పరిస్థితి ఎదురుకావడం ఇది మూడో సారి. ప్రెసిడెంట్ గా ట్రంప్ మొదటి టర్మ్ లో 2018-19 లో దాదాపు 35 రోజుల పాటు అమెరికాలో షట్ డౌన్ జరిగింది. అమెరికా చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్ డౌన్.