మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలను ఆషామాషీగా తీసుకోరాదని, ప్రతిష్టాత్మకంగా తీసుకుని మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితా సిద్ధం చేయడంతోనే సరిపోదని వారిని గెలిపించే బాధ్యతనూ తీసుకోవాలని అన్నారు. మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో పిసిసి చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఈ సందర్భం గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మంత్రులపై బాధ్యత పెట్టారు. ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసేందుకు ఒక్కో జెడ్‌పిటిసి స్థానానికి ముగ్గురి పేర్లతో జాబితా సిద్ధం చేసి, అక్టోబర్ ఐదవ తేదీలోగా పిసిసి చీఫ్‌కు అందజేయాలని ఆ యన సూచించారు.తమిళనాడు తరహాలోనే తెలంగాణాలోనూ బిసి రిజర్వేషన్లు అమలవుతాయని బిసి నేతలు స్పష్టం చేశారు. గవర్నర్,
రాష్ట్రపతి వద్ద ఉన్న పెండింగ్ బిల్లులు మూడు నెలలకు మించి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకోవచ్చని తమిళనాడులో ఇటీవల కోర్టు తీర్పు ఉన్న నేపధ్యంలో తెలంగాణలో కూడా అదే తరహాలో రిజర్వేషన్లు అమలు అవుతాయని పేర్కొన్నారు. మంత్రి పొన్నం నివాసంలో బిసి నేతల కీలక సమావేశం మంగళవారం జరిగింది. రిజర్వేషన్ల కేసులో ఇంప్లీడ్ కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, సీనియర్ నాయకులు వి. హనుమంతరావు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకరయ్య, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మినరల్స్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై వీరంతా చర్చించారు. అలాగే న్యాయపరమైన అంశాల్లో రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్ళాలో కూడా సమావేశంలో చర్చించారు. ఈ నెల 8న కోర్టులో రిజర్వేషన్ల అంశంపై గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.