ఇటీవల లక్ష డాలర్ల వరకు హెచ్1 బి ఫీజును పెంచి వీసాదారులపై పెను భారం మోపుతున్న అమెరికా ప్రభుత్వం భవిష్యత్‌లో మరిన్ని కఠిన చర్యలకు పూనుకోబోతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరికి ముందే ఆ వీసాల జారీలో గణనీయమైన మార్పులు ఉంటాయని వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. పాత విధానంలోని లోపాలకు స్వస్తి పలుకుతామని మంగవారంనాడు ఆయన వెల్లడించారు. హెచ్1 బి నూతన వీసాదారులకు లక్ష డాలర్ల ఫీజు కారణంగా భవిష్యత్‌లో అమెరికాకు వచ్చే వారిపై ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. లాటరీ పద్ధతిలో కూడా మార్పులు ఉండే అవకాశం ఉందని లుట్నిక్ సంకేతాలిచ్చారు.
అసలు లాటరీ ద్వారా అమెరికా నిపుణులైన కార్మికులను, ఉద్యోగులను తీసుకువచ్చుకోవడమేంటన్నారు. పాత విధానంలో ఉన్న లోటుపాట్ల కారణంగా నైపుణ్యం లేని వాళ్లు కూడా కుప్పలు తెప్పలుగా అమెరికాకు వచ్చిపడుతున్నారన్నారు. అమెరికన్లకు మేలు చేకూరే విధంగా చర్యలు చేపడుతూ పాత విధానంలోని కొన్ని నిబంధనలకు చెల్లుచీటి ఇస్తామన్నారు. తద్వారా ఇక నుంచి విదేశాల నుంచి అత్యుత్తమ నిపుణులే దేశానికి వచ్చేలా చర్యలు తీసుకుంటామని, తదనుగుణంగా వీసా విధానంలో మార్పులు చేర్పులు తీసుకువస్తామన్నారు. ఉద్యోగి జీతం, దాని స్థాయి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని లుట్నిక్ సూచన ప్రాయంగా చెప్పారు.