స్వదేశీ వినియోగాన్ని, గిరాకీని పెంచి స్వయం సమృద్ధ భారత్‌ను నిర్మించాలని మన ఏలికలు నిర్దేశించుకోవడం సముచితమే. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన ఎగుమతులపై 50 శాతం, మందులు, ఔషధాలపై నూరు శాతం దిగుమతి సుంకాలు విధించడమే గాక మన సినిమాలపై కూడా ఆంక్షలు విధించి భారత్‌ను ఆర్థికంగా దెబ్బ తీయడానికి కక్షపూరితంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో దేశప్రయోజనాల పరిరక్షణకు జాగ్రత్తగా వ్యవహరించడం అవసరమే. స్వయం సమృద్ధ భారత్ లక్ష్యాలను సాధించాలంటే వివిధ రంగాలలో ముఖ్యంగా దేశసరిహద్దులను కాపాడటం, 146 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రతను సమకూర్చడం ఎంతో ముఖ్యం. దేశభద్రతకు అవసరమైన అత్యాధునిక ఆయుధాలు, క్షిపణి విధ్వంసక వ్యవస్థలు, యుద్ధ విమానాలు, డ్రోన్‌లు, అత్యధిక ఎత్తులో ఎగిరే హెలికాప్టర్ల కోసం భారత్ ఇప్పటికీ రష్యా, అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాలపై ఆధారపడక తప్పడంలేదు. రష్యా నుండి దిగుమతి చేసుకున్న ఎస్-400క్షిపణి విధ్వంసక వ్యవస్థలు ఇటీవల మన దళాలు ఆపరేషన్ సిందూర్ ను నిర్వహించి పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను తుత్తునియలు చేసి, పలువురిని మట్టుపెట్టినపుడు పాక్ వైమానిక దళాలు జరిపిన క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టడంలో ఎస్-400 భారత్‌కు విజయం చేకూర్చడం, రక్షణ రంగంలో మేటిగానిలపడం తెలిసిందే.
రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధించాలంటే ఇంకా చేయవలసినది ఎంతో ఉంది. ఇక పెరుగుతున్న భారత జనాభాకు ఆహార స్వయం సమృద్ధిని సాధించాలంటే సేద్యపు రంగాన్ని ఆధునికీకరించి, ఉత్పత్తిని, ఉత్పదకతను పెంచాలి. మొక్కల ఎదుగుదలకు అవసరమైన సేంద్రియ, వివిధ రసాయనిక ఎరువులను అదనులో అన్నదాతలకు అందుబాటులో ఉంచాలి. ఇటీవల తెలుగు రాష్ట్రాలలో యూరియా దొరకక రైతులు పడరాని పాట్లుపడ్డారు. ఎరువుల సరఫరాను పెంచే చర్యలలో భాగంగానే టాటా కెమికల్స్ ఇటీవల మొరాకో సహకారంతో ఆ దేశంలోని బెర్రెచిడ్‌లో సంయుక్తంగా నిర్మించిన ఫాస్పేట్ ఎరువుల కర్మాగారాన్ని మొరాకో రక్షణ మంత్రి అబ్దుల్ లతీఫ్‌తో కలిసి ప్రారంభించడం శుభసూచికం. మొరాకోలో ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ముడివనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచ ఫాస్పేట్ నిల్వలలో 70% మొరాకోలోనే లభిస్తాయి. ప్రస్తుతం 146 కోట్ల జనాభాతో భారత్ చైనాను వెనకకునెట్టి ప్రపంచంలో మొదటి స్థానానికి చేరింది.
2050 నాటికి దేశ జనాభా 166 కోట్లకు చేరగలదని అంచనా. ఈ భారీ జనాభాకు ఆహార భద్రత చేకూరాలంటే తగిన ఆహారోత్పత్తికి నిరంతరాయంగా ఎరువులు సరఫరా చేయడం అవసరం. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా చేయాలని ఉత్పత్తి, తయారీ రంగాల అభివృద్ధి ద్వారా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ట్రంప్ రానున్న కాలంలో ఏవో కుంటి సాకులతో భారత్ సహా వివిధ దేశాలపై సుంకాలు పెంచడం, వాణిజ్య ఆంక్షలు కొనసాగించవచ్చు. ఇప్పటికే భారీ సుంకాల వల్ల రొయ్యలు, చేపలు సముద్ర ఉత్పత్తులు, వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, వజ్రాలు, స్వర్ణాభరణాలు తదితర పరిశ్రమలలో లేఆఫ్ వల్ల వేలాది మంది ఉపాధి కోల్పోయి దిక్కు తోచక తల్లడిల్లుతున్నారు. అందుకే దేశీయ వినియోగాన్నీ, గిరాకీని పెంపొందించుకుంటూనే ప్రత్యామ్నాయ మార్కెట్‌లను కనుగొనాలి. ప్రధాని మోడీ స్వదేశీ వస్తువులనే కొనాలని అందుకే వస్తుసేవల పన్నును 2 స్లాబులకు కుదించామని, పండగ చేసుకోవాలని చెబుతున్నారు. నత్రజని ఎరువులు ముఖ్యంగా యూరియా ఉత్పత్తి అధికాధికంగా దిగుమతి చేసుకున్న సహజ వాయువుపై ఆధారపడి ఉంది. ఇటీవల అండమాన్ దీవులలో కూడా సహజ వాయువు నిక్షేపాలను కనుగొన్నారు. సహజ వాయువును సరఫరా చేస్తే మరికొందరు పారిశ్రామికవేత్తలు ఎరువుల తయారీకి ముందుకు వస్తారు.
భారత్ ఫాస్పేట్ రాళ్లను, ఆమ్లాన్ని దిగుమతి చేసుకుని కొంత మేరకు ఫాస్పేట్ ఎరువులను ఉత్పత్తి చేస్తోంది. మొరాకోలో ఫాస్పేట్ గనులు అధికంగా ఉన్నందున ఆ దేశంతో సన్నిహితంగా వుండి సంయుక్తంగా, ఉభయ తారకంగా ఎరువుల ఉత్పత్తి జరిగేలా చూడాలి. దేశంలో యూరియాను అవసరమైన మోతాదు కంటే ఎక్కువగా వాడటం వల్ల నేలలపైనే గాక ప్రజారోగ్యంపై కూడా దుష్ప్రభావాలు పడుతున్నట్లు శాస్త్రజ్ఞులు, ఏలికలు హెచ్చస్తున్నారు. డిఎపిలో 18% నత్రజని అవసరం లేదంటున్నారు. యూరియా వాడకాన్ని తగ్గించే రైతులకు ఎకరాకు రూ. 800 ప్రోత్సాహకమిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. టాటా అడ్వాన్స్ సిస్టం వలే మరిన్ని కంపెనీలు ఎరువుల ఉత్పత్తికి మొరాకో లేదా ముడివనరులు అధికంగా లభించే దేశాల సహకారంతో ఉత్పత్తిని ప్రారంభిస్తే పలు దేశాలకు ఎరువులు అందుబాటులోకి వస్తాయి. భారత్ అతి పెద్ద మార్కెట్‌గా ఉండనే ఉంది. మన ఎరువుల కంపెనీలను, పారిశ్రామిక వేత్తలను ఎరువుల ఉత్పత్తికి ప్రోత్సహించాలి. సౌదీ అరేబియా నుండి ఏటా 30 లక్షల టన్నుల ఫాస్పేట్ ఎరువుల సరఫరాకు సంబంధించిన ఒప్పందంపై కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖా మంత్రి జెపి నడ్డా ఇటీవల సంతకాలు చేశారు. పాకిస్తాన్‌తో సౌదీ రక్షణ ఒప్పందం దృష్ట్యా మన దేశం అప్రమత్తంగా ఉండాలి. భారత్ ఆహార భద్రత గురించి యోచించేటప్పుడు ప్రపంచ రాజకీయ పరిణామాలను, వాటి పర్యవసానాలను పరిగణనలోకి తీసుకోవాలి.
ప్రధాని మోడీ, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సేద్యపు రంగ సమస్యలపై ఎప్పటికప్పుడు రాష్ట్రప్రభుత్వాలతో సంప్రదిస్తూ క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే కృషి చేయాలి. దేశంలో 2014లో 385 లక్షల టన్నులుగా ఉన్న ఎరువుల ఉత్పత్తి 2023- 24 నాటికి 503 లక్షల టన్నులకు పెరిగింది. ఈ కాలంలో యూరియా ఉత్పత్తి గరిష్ఠంగా 314 లక్షల టన్నులకు పెరిగింది. డిఎపి, ఎస్‌ఎస్‌పి ఎరువుల ఉత్పత్తి తగ్గింది. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల భూసారం పెరిగి, తేమ నిల్వ పెరిగి పంట దిగుబడులు పెరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు విస్తరణ సేవలు పెంచి, ఎరువులు, విత్తనాల వాడకంపై తగిన సలహాలు ఇస్తే మన అన్నదాతలు అధికోత్పత్తులు సాధించగలరు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు రైతు కుటుంబాలకు చెందినవారే గనుక సేద్యపు రంగ సర్వతోము ఖాభివృద్ధికి మరింత శ్రద్ధతో కృషిచేయగలరని ఆశిద్దాం.
పతకమూరు దామోదర్ ప్రసాద్
94409 90381