దిగ్గజ నేతలున్న నిజామాబాద్ జిల్లాలో ఇంచార్జి మంత్రిగా సీతక్క అగ్నిపరీక్షను ఎదుర్కోబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించడం అంతా సులువేమీ కాదు. సుమారు 4 నెలల క్రితం ఇంచార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆమె పాలన, పార్టీ వ్యవహారాలలో ఇంకా క్రియాశీల పాత్రను పోషించలేకపోతున్నారు. తుఫాన్ విపత్తుల వేళ ఆమె యంత్రాంగాన్ని పరుగులు పెట్టించలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని ఎలా విజయతీరాలకు చేరుస్తారోనన్నదే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సొంత జిల్లాలోనే పార్టీ నిర్దేశించుకున్న మేరకు ఫలితాలు సాధిస్తుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. మొన్నటి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సానుకూల విజయాలు సాధించలేకపోయింది. ఉమ్మడి జిల్లాలో 9 అసెంబ్లీ నియోజక వర్గాలలో 4 నియోజక వర్గాలకే పరిమితమైంది. నిజామాబాద్ లోక్‌సభ నియోజక వర్గం సైతం కోల్పోయింది. 1071 గ్రామ పంచాయతీలు, 540 ఎంపిటిసి స్థానాలు, 56 జెడ్పిటిసి స్థానాలున్నాయి. కాంగ్రెస్ వరుసగా రెండు పర్యాయాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయాలను మూట్టగట్టుకుంది.
పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈసారి జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇది వరకు ఆదిలాబాద్ జిల్లాకు ఇంచార్జిగా మంత్రిగా పని చేసిన సీతక్క సొంత పార్టీల్లోనే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. దీంతో ఆమె పాలన, పార్టీ వ్యవహారాల్లో పట్టు సాధించలేకపోయారు. ఆ జిల్లానుంచి తప్పించాలని సీతక్క అనేక మార్లు సిఎంను కోరింది. ఎట్టకేలకు ఆమె అభ్యర్థనను అంగీకరించిన ముఖ్యమంత్రి ఆమె ఆదిలాబాద్ జిల్లానుంచి తప్పించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి దిగ్గజ నేతలున్న నిజామాబాద్ జిల్లాలో ఇంచార్జి మంత్రిగా ఎన్నికల్లో ఏకపక్ష ఫలితాలు సాధించడం ఆమెకు కత్తిమీద సాముగా ఉండనున్నది. ఆమె ఇంకా పాలన, పార్టీ వ్యవహారాల మీద దృష్టి సారించలేదు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాగైనా నిర్వహించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించడమే సీతక్కకు సిసలైన అగ్నిపరీక్షగా మారబోతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతం స్థానాలు సాధించాలని అధిష్ఠానం స్పష్టం చేసింది. ఇందుకు ఇంచార్జి మంత్రులే బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇంచార్జి మంత్రిలకు అదే తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సానుకూల ఫలితాలే సీతక్కకు సవాల్‌గా మారనున్నాయి.
9 అసెంబ్లీ నియోజక వర్గాలున్న జిల్లాలో అయిదు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఎంఎల్‌ఎలుగా కొనసాగుతున్నారు. మూడు నియోజకవర్గాల్లో బిజెపికి చెందిన వారు ఎంఎల్‌ఎలున్నారు. ఎంపి సైతం బిజెపి ఖాతాలోనే ఉంది. బిఆర్ఎస్కు ఒక్కరే ఎంఎల్ఎ ఉన్నారు. గతంలో బిఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 95% మేరకు ఫలితాలు సాధించింది. రెండు జడ్పి పీఠాలు సునాయాసంగా దక్కించుకుంది. వరుసగా రెండు పర్యాయాలు బిఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి నామమాత్రంగానైన ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అందుకే ఈసారి ఆ పార్టీ అధికారంలో ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా ఫలితాలు వచ్చే పరిస్థితులు లేవు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో అనూహ్యంగా బలపడింది. గతంలో పట్టణ, నగర ప్రాంతాలకే పరిమితం అయిన ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్రామీణ స్థాయిలో బలపడింది. ఈసారి ఎలాగైనా జడ్పి పీఠాన్ని దక్కించుకుంటామని ఎంపి అర్వింద్ పార్టీ పెద్దలకు భరోసా ఇస్తున్నారు. మరోవైపు పదేళ్ల తర్వాత అధికారం కోల్పోయిన బిఆర్ఎస్ క్షేత్ర స్థాయిలో ఇంకా బలంగానే ఉంది. ద్వితీయ శ్రేణి నేతలు అధికార యావలో కాంగ్రెస్‌లోకి వెళ్లారు. కాని క్రియాశీలంగా ఉన్న కార్యకర్తలు పార్టీని వీడ లేదు. మాజీ ఎంఎల్ఎలు హైదరాబాద్‌కు పరిమితం కావడం వల్ల వీరంతా యాక్టివేట్ కాలేకపోతున్నారు.
సమన్వయ లోపం శాపం?
ఇందిరమ్మ ఇండ్లు, గృహలక్ష్మి, సన్నబియ్యం, రైతు భరోసా లాంటివి ప్రజల్లో ప్రభుత్వంపట్ల సానుకూలతను పెంచామనే ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో సానుకూల ఫలితాలు తెచ్చి పెడ్తాయనే భరోసాతో ఉంది. కాని జిల్లాలో సీనియర్ నేతల మధ్య సమన్వయ లోపాలు ప్రతికూలంగా మారాయి. పిసిసి చీఫ్ మహేశ్ గౌడ్ సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితులను చక్కద్దిదలేకపోతున్నారు. ఎంఎల్ఎలు ఎవరికివారే యమునా తీరన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కామారెడ్డి, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గాల్లో మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్, మహేశ్‌కుమార్ గౌడ్ల అధిపత్య పోరు పరాకాష్టకు చేరింది. ఈ దిగ్గజ నేతల మధ్య సమన్వయం కుదిరేలా చేయడం, సీతక్క ప్రతికూల పరిస్థితులను అధిగమించి సానుకూల ఫలితాలు సాధించడం సీతక్కకు సవాల్‌గా మారనున్నది. ఏరికొరి జిల్లాకు ఇంచార్జి మంత్రిగా వచ్చిన సీతక్క మొదట పాలన వ్యవహారాల మీద ఫోకస్ పెట్టాల్సి ఉంది. కఠినంగా అడుగులు వేస్తేనే పార్టీలో పాలనలో తనదైన ముద్రపడే ఛాన్స్ ఉంది.
ఎ. రామకృష్ణ ప్రసాద్
94410 41433