వాషింగ్టన్ : గాజాలో గత రెండేళ్లుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి తాము ప్రతిపాదించిన శాంతి సూత్రంపై హమాస్ స్పందన తెలియజేసేందుకు మూడు నాలుగు రోజులు గడువు ఇస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. లేదంటే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ఈ ఒప్పందాన్ని అసలు అంగీకరించకుంటే ముగింపు విషాదంగా ఉంటుందని హెచ్చరించారు. ఇదే అంశంపై వైట్‌హౌస్ బయట మీడియాతో మాట్లాడారు.
“ఈ ప్రతిపాదనపై భాగస్వామ్య పక్షాలన్నీ స్పందించాయి. ఇజ్రాయెల్ సహా అరబ్ దేశాలు అంగీకరించాయి. ముస్లిం దేశాలు కూడా ఓకే చెప్పాయి. హమాస్ స్పందన కోసం వేచి చూస్తున్నాం. వారు అంగీకరిస్తారో లేదో తెలియదు. మూడు, నాలుగు రోజులు వేచి చూద్దాం. ఒకవేళ అంగీకరించకుంటే ముగింపు చాలా విషాదంగా ఉంటుంది. ఇజ్రాయెల్ ఏం చేయాలో అది చేస్తుంది ” అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ శాంతి ఒప్పందం ప్రకారం 72 గంటల్లో బందీలను హమాస్ విడిచిపెట్టాలి.
ఇజ్రాయెల్ కూడా క్రమంగా గాజా నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకునేలా ప్రతిపాదనలు చేశారు. అయితే దీనిపై హమాస్ చర్చలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. రాజకీయ, సైనిక నాయకత్వంతో సంప్రదింపులు ప్రారంభించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే సంక్లిష్టతల కారణంగా వీటికి మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉందని సమాచారం. తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను వదిలివేయడానికి సిద్ధంగా ఉన్నామని, ట్రంప్ సూచించిన ప్రణాళికపై మాత్రం అధ్యయనం చేసి అభిప్రాయం వెల్లడిస్తామని హమాస్ చెబుతోంది.