రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిలిమ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సినిమాను నిర్మించారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే.. ‘గల గల పారే గోదావరి గట్టుతో కళ కళలాడే అందమైన పల్లెటూరులో ఓ అమ్మాయిని చూడగానే తొలి చూపులోనే అబ్బాయికి ప్రేమ పుడుతుంది.
ప్రేమ ఆ చూపుతో మొదలైంది.. కాలం బొమ్మలా ఆగిపోయింది. ఆమెతో పాటే నా మనసు కూడా మాయమైంది’ అనే డైలాగ్ హీరోయిన్‌పై హీరోకి ఉన్న గాఢమైన ప్రేమను తెలియజేస్తుంది. చివరకు హీరోయిన్ కనపడగానే హీరో పడే భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. గోదావరి నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలోని సన్నివేశాలు ట్రైలర్‌లోనే హృదయాలను హత్తుకుంటుంటే సినిమాలో ఎమోషన్స్ ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తిని కలిగిస్తోంది.