గతంలో ఎన్నడూ లేని విధంగా రుతుపవనాల ప్రభావంతో అకస్మాత్తుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. నగరాలు సాగరాలను తలపిస్తున్నాయి. ఈ పరిస్థితిని తట్టుకునే విధంగా నగరాలు సంసిద్ధంగా ఉన్నాయా? ఒకవైపు చెరువులు, గుంతలు, వాగులు కబ్జాకు గురికావడం మరో వైపు వరద నీరు బయటకు వెళ్లే దారిలేకపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మారిన పరిస్థితుల వల్లనే నగరాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయని, హైదరాబాద్ లోనూ అకస్మాత్తుగా వర్షాలు కురుస్తున్నాయని, నగరంలో 2 సెం.మీ వర్షం కురిస్తే అస్తవ్యస్తం అవుతోందని ఆదివారం (28.9.25 )ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన చెందడం సహజమే. వరద నీటిని నియంత్రించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవలసిన అవసరం ఉందన్నారు. మూసీ నది మహోగ్రరూపం నగరాన్ని ఎంత అల్లకల్లోలం చేసిందో అందరికీ తెలిసిందే. నగరం మధ్యలోంచి 55 కి.మీ పొడవునా ప్రవహిస్తోన్న మూసీనది వెంబడి జియాగూడ, చాదర్‌ఘాట్, గోల్నాక, అంబర్‌పేట ఇలా ఎక్కడ చూసినా మూసీకి ఆక్రమణలే. 1908లో మూసీకి వరదలు వచ్చినప్పుడు వరదల్లో చిక్కుకుని 2 వేల మంది మృత్యువాత పడ్డారు. ఆ తరువాత 62 ఏళ్లకు 1970 లో వరదలు వచ్చాయి. అనంతరం 30 ఏళ్లకు 2000 లో వచ్చిన వరద నగరాన్ని ముంచెత్తింది. మూసీ వరద ముప్పు నివారణకు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాలు నిర్మించినా ఏం లాభం? ఆక్రమణలతోనే పదేపదే వరదలు వస్తున్నాయి. 2008, 2014, 2016, 2018, 2020 లోనూ వరదలు వచ్చాయి. మరోసారి ఈ ప్రమాదాలు ఎదురు కాకుండా ఉండాలంటే బహుముఖ ప్రణాళికలు అవసరం.
భాగ్యనగరంలో ఒకప్పుడు వందలాది చెరువులు ఉండేవి. చివరకు 134 సరస్సులు ఆక్రమణల పాలైనట్టు గుర్తించారు. ఈ సరస్సుల చుట్టూ 14,061 ఆక్రమణలు బయటపడ్డాయి. మొత్తం ఆక్రమణల్లో 85 శాతం కేవలం 30 నీటివనరుల్లోనే గుర్తించగా, 15% 104 సరస్సుల చుట్టూ ఉన్నట్టు గుర్తించారు. హైడ్రా ఏర్పాటుతో అక్రమ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపడం కొనసాగుతోంది. ఆక్రమణలను తొలగించడంతోపాటు వరద కాల్వలను సరిగ్గా నిర్వహించడం తప్పనిసరి. నగరంలోని వరద కాల్వల్లో ప్లాస్టిక్ వంటి వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఏటా 5 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక వస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట వంటి ప్రాంతాల్లో వరదనీటి కాలువలు మూసుకుపోయాయి. బంజారా హిల్స్‌లో 20 ఏళ్ల క్రితం వేసిన వరదనీటి పైపులు రోడ్డుకు 10 అడుగుల లోతున కూరుకుపోయాయి.
ప్రస్తుతం రుతుపవనాల పోకడలో మార్పు కనిపిస్తోంది. దేశంలో 100 నుంచి 120 రోజులకు రుతుపవనాలు విస్తరించగా కొన్ని గంటల్లోనే భారీగా వర్షపాతం నమోదవుతోంది. గత మే నెలలో ముంబైలో కేవలం 24 గంటల్లోనే 135.4 మి.మీ వర్షం కురిసింది.ఆ మరునాడు 161.9 మి.మీ వర్షం పడింది. అదే రోజు ఢిల్లీలో కొన్ని గంటల్లోనే 81 మి.మీ వర్షపాతం నమోదైంది. గురుగావ్, కోల్‌కతా వంటి నగరాలు కూడా జడివానలతో అల్లకల్లోలమయ్యాయి. పంజాబ్‌లో 23 జిల్లాలు దెబ్బతిన్నాయి. అప్పటి వాతావరణానికి తగినట్టు నిర్మాణమైన నగరాలు ఇప్పటి మారుతున్న వాతావరణానికి తగినట్టు సిద్ధమైతేనే ప్రజలకు భద్రత కలుగుతుంది. మురుగునీరు, వాననీటి కాలువలు కాలం చెల్లిన వ్యవస్థలుగా మారాయి. పాత పద్ధతి ప్రకారం జూన్ రుతుపవనాల క్యాలెండర్ బట్టి రుతుపవనాలకు ముందు, తరువాత ఈ కాలువలను శుభ్రం చేస్తున్నారు. కానీ వ్యర్థాల నిర్మూలన విస్మరిస్తున్నారు. కాలువలను తాజాగా ఎంత పరిశుభ్రం చేసినా వ్యర్థాలను తొలగించలేనిదే ప్రయోజనం కలగదు. సమస్య అలాగే కొనసాగుతుంది. శానిటేషన్, మురుగు కాలువల పర్యవేక్షణ విభాగాల మధ్య సమన్వయం అవసరం. ఇలాంటి సమన్వయం వల్లనే విజయవాడలో సత్ఫలితాలు వచ్చాయి. రుతుపవనాల ప్రతిస్పందన బృందాల్లో శానిటేషన్, ఇంజినీరింగ్, ప్లానింగ్ విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రయోజనం చేకూర్చాయి.
ఫలితంగా వరదనీటి ముప్పు ప్రజలకు తప్పింది. కోల్‌కతా నగరంలో ఫరక్కా బ్యారేజిలో పూడిక తీయకపోవడంతో గంగానదిపై 300 కి.మీ ఎగువన వరదనీరు ఉప్పొంగి సెప్టెంబర్ 23న కలకత్తా నగరాన్ని ముంచెత్తింది. తొమ్మిది మంది మృతి చెందారు. కొన్ని దశాబ్దాల క్రితం వరకు కాలువలు, మురుగునీటి పారుదల నిర్వహణకు విస్తృతమైన నెట్‌వర్క్ ఉండేది. నగరంలోని మురుగు నీటినంతా తూర్పు కోల్‌కతాలోని తేమ భూముల్లోకి పంపించేవారు. అయితే ఈ తేమభూములు కబ్జాల పాలు కావడంతో మురుగు నీటి పారుదల వ్యవస్థ మురిగిపోయింది. ఈ నేపథ్యంలో మురుగునీటి పారుదల వ్యవస్థ అభివృద్ధికి గత ఫిబ్రవరిలో ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ రూ. 200 మిలియన్ డాలర్ల రుణం మంజూరు చేసినా ఇంకా పనులు ప్రారంభం కాకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అశ్రద్ధకు తార్కాణం.
కలకత్తా ఇప్పుడు వరద నీటిలో మునిగి తేలడానికి ఫరక్కా బ్యారేజి, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వంటి కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సంస్థలే ప్రధాన కారణమని మమతా బెనర్జీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. బొంబాయి తీవ్ర వర్షపాత సంఘటనలతో అల్లాడుతోన్న సంగతి తెలిసిందే. అక్కడి బృహన్ మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) వర్షపు నీటి కాలువల (స్టార్మ్‌వాటర్ డ్రైన్లు) సామర్థాన్ని విస్తరింపజేయడానికి కొత్త ప్రణాళిక రూపొందిస్తోంది. ఒక గంటలో 120 మి.మీ వరకు వర్షం ఏకధాటిగా కురిసినా తట్టుకునేలా కాలువలను వెడల్పు చేస్తామని ప్రకటించింది. ఈ విధంగా నగరాల్లోని కాలువలను వెడల్పు చేసి సామర్థాన్ని పెంచడం తప్పనిసరి.