రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఇచ్చిన స్పష్టమైన హామీతో బుధవారం నుంచి తలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా విరమించుకున్నట్లు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు తెలిపారు. తమ సమస్యలపై కమిషనర్‌ను కలిసి చర్చించినట్లు తెలిపారు. తానిప్పుడే కొత్తగా వచ్చానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, అయితే కొంత సమయం కావాలని కమిషపర్ చెప్పారని వెల్లడించారు. అంతకు ముందు కమీషన్ బకాయిలు చెల్లించకపోవడంతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాలు మూసివేసి నిరసన తెలపాలని రేషన్ డీలర్లు నిర్ణయిచుకున్నారు. తమకు ప్రభుత్వం నుంచి ఆరు నెలల కమీషన్ బకాయిలు రూ.120 కోట్లు, గన్నీ సంచుల డబ్బులు రూ.6 కోట్లు, కెవైసికి సంబంధించిన రూ.15 కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని డీలర్లు చెబుతున్నారు. బకాయిలు విడుదల చేయడంతో పాటు తక్షణమే హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు పేరుకుపోవడంతో దుకాణల అద్దె, హమాలీ కూలి కోసం సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తమకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం చెల్లించాలని, కమీషన్ పెంచాలని కోరిన సంగతి తెలిసిందే.