హైదరాబాద్: డిజిపి జితేందర్ పదవీ విరమణ చేశారు. డిజిపిగా 14 నెలలపాటు జితేందర్ పనిచేశారు. రాష్ట్ర పోలీసులు డిజిపి జితేందర్ కు ఫేర్ వెల్ పరేడ్ పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. జితేందర్ వీడ్కోలు కార్యక్రమానికి కొత్త డిజిపి శివధర్ రెడ్డి హాజరయ్యారు. సైబర్ క్రైమ్ నార్కోటిక్స్ కఠిన చర్యలు చేపట్టామని డిజిపి జితేందర్ తెలిపారు. పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేశామని అన్నారు. అత్యాధునిక సాంకేతికత సాయంతో అనేక నేరాలు ఛేదించామని, కొన్ని సమస్యలను మానవతాకోణంలో పరిష్కరించామని చెప్పారు. బాధితులకు అండగా ఉండేందుకు పోలీసుశాఖ ఎల్లప్పుడూ సిధ్ధం అని కొత్త డిజిపి శివధర్ రెడ్డికి వివిధ విభాగాల్లో చాలా అనుభవం ఉందని తెలియజేశారు. తన అనుభవంతో అద్భుతంగా విధులు నిర్వహిస్తారని భావిస్తున్నానని అన్నారు. తనకు సహాయ, సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 33 ఏళ్ల పాటు పోలీసు సర్వీసులో ఉన్నానని, నేషనల్ పోలీస్ అకాడమీలో తనను ఎపి కేడర్ కు కేటాయించారని అన్నారు.
ఇక్కడి అధికారులు తనకు ఎంతో సహకరించారని, డిజిపిగా ఉన్న 15 నెలల్లో శాంతిభద్రతలు అదుపులోకి తెచ్చానని చెప్పారు. రాష్ట్రంలో నేరాల రేటు తగ్గించేందుకు పలు చర్యలు చేపట్టామని, రాష్ట్ర పోలీసులకు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందని కొనియాడారు. కామారెడ్డి, నిజామాబాద్ వరదల్లో అనేకమంది ప్రాణాలను కాపాడామని, నార్కోటిక్స్, సైబర్ క్రైమ్ నేరాల కట్టడికి నిరంతర కృషి చేస్తున్నామని అన్నారు. బెట్టింగ్ మాఫియాపైనా లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ మొదటిస్థానంలో ఉందని, నేరాల ఛేదనలో టెక్నాలజీ చాలా కీలకంగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 10 లక్షల సిసి కెమెరాలతో నిఘా ఉందని, సంచలనం సృష్టించిన పలు కేసులను 48 గంటల్లోనే ఛేదించామని స్పష్టం చేశారు. మరణించిన తల్లిని గుర్తుచేసుకుని కంటతడి పెట్టారు.