న్యూఢిల్లీ/పాట్నా: అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీహార్ ఓటర్ల తుది జాబితాను మంగళవారం ప్రచురించారు. ఓటర్ల సంఖ్య స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ముందున్న 7.89 కోట్లకు దాదాపు 47 లక్షలు తగ్గి 7.42 కోట్లకు చేరుకుంది. ఆగస్టు 1నా జారీచేసిన ముసాయిదా జాబితాలోని 7.24 కోట్ల ఓటర్లకు తుది సంఖ్య 17.87 లక్షలు పెరిగింది. కాగా వలసలు,నకిలీ ఓటర్లు వంటి వివిధ కారణాల వల్ల అసలు జాబితా నుండి 65 లక్షల మంది ఓటర్లను తొలగించారు. పోలింగ్ ప్రక్రియలో అనుబంధ జాబితాలు ప్రచురించాక తుది సంఖ్య స్వల్పంగా మారవచ్చు. వచ్చే వారం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది.
బీహార్‌లో అక్టోబర్ చివరి వారంలో జరుపుకునే ఛత్ పండుగ తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సంభావ్య(ప్రాస్పెక్టివ్) ఓటర్లు సమర్పించిన పత్రాలు, పార్టీలు, వ్యక్తులు దాఖలు చేసిన అభ్యంతరాలను నెలరోజు పాటు మూల్యాంకనం చేసిన తర్వాత 3.66 లక్షల మంది ఓటర్లను ముసాయిదా జాబితా నుండి తొలగించగా, 21.53 మందిని చేర్చినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సన్నద్ధతను సమీక్షించడానికి ఎన్నికల అధికారి అక్టోబర్ 4, 5 తేదీలలో పాట్నాను సందర్శించనున్నారు. 243 మంది సభ్యులుండే బీహార్ అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 22తో ముగియనున్నది. 22 సంవత్సరాల విరామం తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)ను విజయవంతంగా పూర్తిచేసినందుకు బీహార్‌లోని ఓటర్లందరికీ, ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీలకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారని ఎన్నికల సంఘం తెలిపింది.