న్యూఢిల్లీ: ప్రముఖ బిజెపి నేత విజయ్ కుమార్ మల్హోత్రా(93) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన ఢిల్లీ బిజెపి తొలి అధ్యక్షుడు, అంతేకాక ఢిల్లీ నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. గత కొంతకాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు. ఢిల్లీ బిజెపి నాయకులలో ఆయన ప్రముఖుడు. ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. 2008 ఎన్నికల్లో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన్ని చూయించారు. నాడు షీలా దీక్షిత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. ఆయనకు నివాళులు ఘటించేందుకు ఆయన పార్థీవ శరీరాన్ని పండిత్ మార్గ్‌లోని బిజెపి కార్యాలయంలో అక్టోబర్ 1న మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఉంచనున్నారు. తరువాత ఆయన అంత్యక్రియలు లోధి రోడ్డులోని శ్మశానవాటికలో జరుగనున్నది.
మల్హోత్రా మరణంపై ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ సంతాపం ప్రకటించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా ఆయనకు నివాళులు అర్పించారు. ‘జన్‌సంఘ్ మొదలుకుని బిజెపి ఏర్పడే దాక విజయ్ మల్హోత్రా జాతీయవాదానికి ఓ ఉదాహరణగా ఉండేవారు, ఆయనలో వ్యవస్థీకరణ నేర్పులు, క్రమశిక్షణ ఉండేవి’ అని రేఖా గుప్తా తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘ప్రముఖ బిజెపి నాయకుడి మృతి హృదయ విధారకం’ అని మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు.